అమావాస్య చంద్రుడు.. కమల్ హాసన్ సినిమాల్లో అత్యంత వైవిధ్యభరిత, ప్రయోగాత్మాక, విభిన్నమైన సినిమాల్లో ఇదీ ఒకటి. ప్రయోగాలకు పెట్టింది పేరైన యూనివర్సల్ స్టార్ నటించిన వందో సినిమా ఇది. ఇంతేకాదు.. ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. నటుడిగా కమల్‌కు ఇది వందో సినిమా. ఈ సినిమా విడుదలైన 1981 నాటికే కమల్ వంద సినిమాలను పూర్తి చేశాడు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కమల్ ప్రొడక్షన్లో వచ్చిన తొలి సినిమా కూడా. హాసన్ బ్రదర్స్ ప్రొడక్షన్స్‌పై నిర్మించిన ఈ సినిమాతో కమల్, ఆయన సోదరులు నిర్మాతలుగా మారారు. ఈ సినిమా ఆద్యంతం కమల్ అంధుడిగా కనిపిస్తాడని వేరే చెప్పనక్కర్లేదు. తన సహజశైలిలో కమల్ అంధుడి పాత్రలో జీవించేశాడు. దానికి బోలెడన్ని ప్రశంసలు… ఈ సినిమాకు అనేక అవార్డులు కూడా దక్కాయని వేరే చెప్పనక్కర్లేదు.
ఇందులో నటనకు గానూ కమల్ ఫిల్మ్‌ఫేర్ వచ్చింది. మ్యూజికల్‌గా కూడా ఈ సినిమా పెద్ద హిట్. ఇళయారాజా స్వరకల్పనలో ‘‘సుందరము.. సుమధురమూ..’’ అంటూ సాగే పాటకు బాలూ జాతీయ అవార్డును కూడా పొందారు. తమిళానికి గానూ ఆయనకు గాయకుడిగా ఈ సినిమాతో జాతీయ అవార్డు దక్కింది.
ఈ సినిమా ఎప్పటికీ క్లాసిక్‌గా నిలిచిపోతుంది అంతేకాదు.. ఈ సినిమాతో కమల్‌ను చుట్టుముట్టిన కష్టాలు కూడా ఎప్పటికీ గుర్తుండిపోతాయట. ఈ విషయాన్ని ఆయనే ఒకసారి చెప్పారు. తన వందో సినిమాతో అది కూడా ప్రయోగాత్మక సినిమాతో నిర్మాతగా మారిన కమల్‌కు తీవ్రమైన నష్టాలు మిగిల్చింది ఈ సినిమా. కమర్షియల్‌గా వర్కవుట్ కాకపోవడంతో ఈ సినిమాతో భారీ నష్టాలు వచ్చినట్టుగా కమల్ పేర్కొన్నాడు. ఎంతగా అంటే.. దీని లాస్ నుంచి కోలుకోవడానికి తనకు ఎనిమిది సంవత్సరాలు పట్టిందని కమల్ చెబుతారు. అంత తీవ్రమైన నష్టాలను చవి చూసినట్టుగా కమల్ వివరిస్తారు.
మరి కమల్ లాంటి బిజీ హీరో, భారీ రెమ్యూనరేషన్ తీసుకునే హీరో ‘‘అమావాస్య చంద్రుడు’’ సినిమా నష్టాల నుంచి కోలుకోవడానికి ఎనిమిదేళ్లు పట్టిందంటే.. ఎంత నష్టం వచ్చి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తన తొలి సినిమాతోనే ఇంతటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నా.. కమల్ మాత్రం ఆ తర్వాత వెనక్కు తగ్గిన దాఖలాలు లేవు. ఆ తర్వాతి కాలంలో తన హోమ్ ప్రొడక్షన్లో అనేక భారీ సినిమాలను, ప్రయోగాత్మక సినిమాలను రూపొందించాడు విశ్వనాయకుడు. ‘‘రాజ్ కమల్ ప్రొడక్షన్స్’’ బ్యానర్ మీద బోలెడన్ని సినిమాలు వచ్చాయి. తన సోదరులతో కలిసి కమల్ ఆయా సినిమాలను నిర్మించారు.