వర్మ ట్వీట్లు శృతి మించడం అన్నది కొత్త విషయం కాదు. ఇప్పుడు లేటెస్ట్ గా కమ్మ..కాపు..రాజులు అంటూ టాలీవుడ్ లో కులాల గురించి ప్రస్తావిస్తున్నాడు. టాలీవుడ్ లో వీళ్లకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు..వాళ్లకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు అని అనుకోవడానికి లేదు. ఎవరి ఫీలింగ్ లు వారికి వున్నాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో రెండు రకాల వ్యవహారాలు నడుస్తున్నాయి. ఒకటి వారి వారి స్వంతవారి మద్దతు కోసం ఫీలింగ్ వున్నట్లు కనిపిస్తూనే, అసలు సిసలైన బిజినెస్ కమ్యూనిటీని దగ్గరకు తీసుకోవడం.
లోపల ఫీలింగ్ లు, ఎలా వున్నా బయటకు మాత్రం వ్యాపారాలకు ఎవరు పనికి వస్తారు అంటే వాళ్లతోనే వుంటున్నారు టాలీవుడ్ జనాలు. నాగ్, చిరంజీవి కలిసి బిజినెస్ లు చేయలేదా? అరవింద్, యువి, దిల్ రాజు కలిసి వ్యాపార సిండికెట్ లు రన్ చేయడం లేదా? కమ్మ హీరోలకు కాపు డైరక్టర్లు హిట్ లు ఇవ్వడం లేదా? కాపు హీరోలకు కమ్మ డైరక్టర్లు బ్లాక్ బస్టర్లు ఇవ్వడం లేదా?
టాలీవుడ్ లో రెండే అసలు సిసలు కులాలు. డబ్బు,సక్సెస్. వాటితోనే ఎవరైనా కలిసి వెళ్లేది. ఇక మిగిలిన స్వంత కులాల వ్యవహారాలా? అవి కవచకుండలాల్లా వుంటూనే వుంటాయి. వాటిని అంటిపెట్టుకుని వుంటూనే, వాటిని చూపిస్తూ తమ తమ కులాల మద్దతు సంపాదిస్తూనే, వ్యాపారాలకు మాత్రం అందరూ కలిసే చేసుకుంటారు. అది తెలియక అభిమానులు మాత్రం మా కులపోడు.. మా కులపోడు అని కొట్టేసుకుంటూ వుంటారు. వాళ్లను అలా వుంచే వీళ్లు అందరూ కలిసే వ్యాపారాలు చేసుకుంటారు. పరిస్థితి ఇలా వుంటే వర్మ ఎందుకో కెలకడం. అయినా ‘వర్మ’కు కాపు హీరోలంటే కోపం ఎందుకొ వద్దన్నా బయటపడిపోతూ వుంటుంది.