ఛలో హిట్ అయిందని కణం సినిమా రేట్లు పెంచితే ఎలా..? కనీసం మూవీ జానర్ ఏంటనేది ఆలోచించాలి కదా. ఛలో అనేది పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. కణం అనేది పూర్తిస్థాయి ప్రయోగాత్మక చిత్రం. ఇందులో కూడా ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. అలాంటప్పుడు ఛలో, కణం సినిమా ఒకే రీతిన ఎలా వసూళ్లు సాధిస్తాయి.
కొన్ని అనుకోని పరిస్థితుల మధ్య కణం చేయాల్సి వచ్చిందని, తను తీసుకున్న రాంగ్ డెసిషన్స్ లో ఆ సినిమా కూడా ఒకటని స్వయంగా నాగశౌర్య గతంలో చెప్పుకొచ్చాడు. కణం సినిమాపై ఈ హీరోకు ఎలాంటి అంచనాల్లేవ్. కానీ కణం కంటే ముందొచ్చిన ఛలో సినిమా సక్సెస్ అవ్వడంతోనే వచ్చింది చిక్కంతా.
ఛలో హిట్ అయింది కాబట్టి కణం సినిమాకు భారీ రేట్లు చెబుతున్నారట. దీనికి తోడు సాయిపల్లవి కూడా ఉంది కాబట్టి రేటు విషయంలో అస్సలు తగ్గడం లేదట. ఈ మూవీ బిజినెస్ ను ఇంకాస్త పెంచడం కోసం రిలీజ్ డేట్ ను కూడా పోస్ట్ పోన్ చేశారు. అంతా అనుకుంటున్నట్టు ఈ నెల 23కు ఈ సినిమా రావడం లేదు. అనుకున్న మొత్తం కంటే 10శాతం ఎక్కువకు అమ్మిన తర్వాతే రిలీజ్ చేస్తారట నిర్మాత ఎన్వీ ప్రసాద్.
ఇంతా చేసి ఈసినిమా కమర్షియల్ మూవీ కాదు. అబార్షన్లు, ఆత్మలు అంటూ సాగే కథ ఇది. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ డైరక్ట్ చేశాడు. ఫ్లాప్ అని చెప్పడం ఉద్దేశం కాదు కానీ, కచ్చితంగా కమర్షియల్ రేంజ్ లో కలెక్షన్లు వచ్చే సినిమా మాత్రం కాదు.