నాగబాబుపై కాపు కుల పెద్దల వత్తిడి చేసారా? లేదా చిరంజీవి చేయించారా? మొత్తానికి ఈ రెండింటిలో ఒకటి జరిగిందని తెలుస్తోంది. దాని ఫలితంగానే నాగబాబు తాము తెలుగుదేశంలో చేరడం లేదని అత్యవసరంగా ప్రకటించారని వారి సన్నిహిత వర్గాల బోగట్టా.
పవన్ రాజకీయాల్లోకి వస్తారని ఊహాగానాలు ప్రారంభమైన నాటి నుంచి ఇటు నాగబాబు కానీ, అటు కళ్యాణ్ కానీ వాటిని పట్టించుకోలేదు. టేకిటీజీగా తీసుకున్నారు. పైగా వీటి గురించి తమ సన్నిహితులతో కూడా మాట్లాడలేదు. ఇలా ఇలా పెద్దవి అవుతున్నా ఊరుకున్నారు. ఇంతలో తెలుగుదేశం కండువాతో పవన్ ఫొటో నెట్ లో హల్ చల్ చేయడం, యనమల రామకృష్ణుడు బహిరంగంగా స్వాగతం పలకడం, మెట్ల సత్యనారాయణను హడావుడిగా పార్టీ ఉపాధ్యక్షుడిగా ప్రకటించడం వంటివి కాపులను ఆందోళనకు గురిచేసాయి.
తెలుగుదేశం పార్టీ ఓ పథకం ప్రకారం కాపులను ఊరించే పనికి పూనుకుంటోందని వారికి అర్థమయింది. దీనికి ప్రారంభంలోనే బ్రేకు వేయాలని వారు భావించారు. అదే విషయాన్ని వారు చిరంజీవి తో కూడా చర్చించారని తెలిసింది. దానికి చిరంజీవి మీరే నేరుగా నాగబాబుతో మాట్లాడమని సలహా ఇచ్చినట్లు బోగట్టా. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తల్లో ఆంధ్ర ప్రాంతంలోని కాపు కమ్యూనిటీతో నాగబాబే సమావేశాలు వరుసగా నిర్వహించారు. ఇప్పటికీ ఆయనకు వారందరితీ మంచి సంబంధాలు వున్నాయి.
దాంతో వారు ఈ వదంతలు, తెలుగుదేశం పార్టీ వ్యూహాలు నాగబాబు దృష్టికి తెచ్చారు. తక్షణం ప్రకటన ఇవ్వాల్సిన అవసరం వివరించారు. దాంతో తప్పని సరై, నాలుగు లైన్ల ప్రకటనను ఆయన తన అంజనా ప్రోడక్షన్స్ లెటర్ హెడ్ పై విడుదల చేసారు. తాను పవన్ బిజీగా వున్నామని చెప్పారే కానీ, పవన్ తరపున కూడా తాను ఆ ప్రకటన చేస్తున్నట్లు ఆయన ఎక్కడా పేర్కోనకపోవడం గమనార్హం.
ఎందుకంటే, ఇలాంటి వాటిని విని ఊరుకోవడమే కానీ, ఖండిస్తూ పోవడం తన వల్ల కాదని పవన్ అభిప్రాయం. మొత్తానికి పవన్ పై వల వేద్దామని తెలుగుదేశం పార్టీ భంగపడిరది. అయితే ఇది ప్రచారంలోకి రావడంతో, మిగిలిన కులస్థులు ఎక్కడ అఫెండ్ అవుతారో అని, పార్టీ శ్రేణులకు పంపిన అంతర్గత మెసేజ్ లో, దీనికి ప్రచారం ఇవ్వ వద్దని ఆదేశించింది. బిసిలకు వంద సీట్లు ఇస్తామని చెప్పామని, అన్ని కులాలు సమానమే అని చెప్పాలని కోరింది. అంటే ఈ అంశం'దేశా'నికి బాగానే డామేజ్ చేసిందన్నమాట.