‘రాజకీయాలు పక్కన పెట్టు.. సమైక్య రాష్ట్రం కోసం నడుం బిగించు.. రా కదలి రా..’ అంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. ప్రత్యేక తెలంగాణకు తాము వ్యతిరేకం కాదు.. అంటూ జగన్, గతంలో చెప్పిన మాటలు పక్కన పెట్టారు. అడ్డగోలు విభజనకు ఒప్పుకోం.. సమన్యాయం ఇరు ప్రాంతాలకూ జరిగేలా విభజించలేని పక్షంలో, విభజన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గండి.. అనే నినాదంతో జగన్ దూసుకెళ్తున్నారు.
రాష్ట్ర రాజకీయ చరిత్రలో.. గడచిన దశాబ్ద కాలంలో తొలిసారిగా సమైక్యాంధ్రప్రదేశ్‌కి మద్దతుగా రాష్ట్ర రాజధాని హైద్రాబాద్‌లో తొలి రాజకీయ బహిరంగ సభ జరుగుతోంది. ఈ ఘనతను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకోనుంది. ఇంకో రెండ్రోజులే మిగిలి వుంది ఆ అద్భుతానికి. ఇది నిజంగానే అద్భుతం అని చెప్పక తప్పదు. ఎందుకంటే, సమైక్య రాష్ట్రమంటే రాయలసీమ, కోస్తాంధ్ర మాత్రమే కాదు.. తెలంగాణ కూడా.. అని చెబుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం నలుమూలలనుంచీ సమైక్యవాదులను హైద్రాబాద్‌కి తీసుకొస్తోంది.
జగన్ సమైక్య సభ ఏ మేరకు విజయవంతం సాధిస్తుంది.? అన్నదానిపై నేషనల్ మీడియా కూడా ప్రత్యేకమైన దృష్టిపెట్టింది. జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీలు జగన్‌కి ఆంధ్రప్రదేశ్‌లో వున్న బలంపై అంచనాలు వేయడానికి, సమైక్య శంఖారావం సభను వేదికగా చేసుకున్నాయంటే, ఈ సభ వైసీపీకి ఎంత ప్రతిష్టాత్మకమో అర్థం చేసుకోవచ్చు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఎలాగైతే తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో జతకట్టి ఉద్యమంలో పాల్గొన్నాయో, అలాగే ఇప్పుడు జగన్ వెంట సమైక్య రాష్ట్రం కోరుకునే పార్టీలూ నడవాల్సి వుంటుందనీ, అప్పుడే సమైక్య రాష్ట్రాన్ని కాపాడుకోగలమనీ మొత్తం 13 జిల్లాల్లోని సమైక్యవాదులూ ఘంటాపథంగా చెబుతున్నారు.
ఇక, సాక్షి మీడియాలో వైసీపీ సమైక్య శంఖారావం గురించి జరుగుతున్న ప్రచారం చూస్తోంటే, ఈ ప్రచారంతో సమైక్యవాదుల్లో నరనరానా ఉద్యమ రక్తం ఉరుకులేస్తోంది. చిన్న పిల్లలనుంచీ, ముదుసలి వరకూ సమైక్య రాష్ట్రం ఎందుకు.? అనేదానికి సరిగ్గా సమాధానమిస్తున్నారు. కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, విద్యార్థులు.. ఒకరేమిటి, అందరూ సమైక్య రాష్ట్రం కోసం సీమాంధ్రలో 80 రోజులకుపైగా ఉద్యమిస్తున్నారు. తుపాను, వరదల కారణంగా ఇప్పుడది కాస్త చల్లారినా, వైసీపీ సమైక్య సభతో మళ్ళీ సమైక్య ఉద్యమం పోటెత్తే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.
నిన్న మొన్నటిదాకా జగన్‌పై రాజకీయ విమర్శలు చేసిన సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ నేతలు సైతం ఇప్పుడు వైసీపీ సమైక్య శంఖారావంపై ప్రత్యేకమైన దృష్టిపెట్టారు. ఆ వేదికలో తామూ భాగస్వాములైతే ఎలా వుంటుందన్న చర్చ అంతర్గతంగా వివిధ పార్టీలకు చెందిన సీమాంధ్ర నేతల్లో జరుగుతోంది. అయితే పార్టీ లైన్లు దాటి ముందుకు వెళ్ళలేక సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వైసీపీయేతర నాయకులు మల్లగుల్లాలు పడ్తున్నారు.
ఏమో.. అక్టోబర్ 26 నాటికి, సీమాంధ్ర రాజకీయ నాయకుల్లో ఎలాంటి మార్పులు రానున్నాయో ఇప్పుడే చెప్పలేం. అప్పటికప్పుడు పార్టీల జెండాల్ని పక్కన పెట్టి, సమైక్య ఉద్యమం కోసం వివిధ పార్టీలకు చెందిన నేతలు సమైక్య శంఖారావానికి ‘జై’ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదనే గుసగుసలు మీడియా, రాజకీయ వర్గాల్లో విన్పిస్తుండడం గమనార్హం.
ఇక, సీమాంధ్రలోని 13 జిల్లాల నుంచీ పెద్దయెత్తున జనాన్ని సమీకరించేందుకు వైసీపీ భారీ ఏర్పాట్లు చేసింది. వివిధ జిల్లాలనుంచి ప్రత్యేక రైళ్ళు, పెద్దయెత్తున బస్సులు, ఇతర వాహనాలూ హైద్రాబాద్‌కి రానున్నాయి వేల సంఖ్యలో సమైక్యవాదులను మోసుకుని. తెలంగాణ నుంచీ పెద్ద సంఖ్యలో సమైక్యవాదులు సమైఖ్య సంఖారావానికి హాజరువతారనేది ఓ అంచనా. అది ఏ మేరకు.? అన్నది ఇప్పుడే చెప్పలేం.
గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోనే సుమారు రెండు, మూడు లక్షల మంది సమైక్యవాదులు సమైఖ్య శంఖారావానికి హాజరయ్యేలా వైసీపీ ఏర్పాట్లు చేసిందనే ప్రచారం జరుగుతోంది. గతంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉద్యోగులు నిర్వహించిన సమైక్య సభకూ హైద్రాబాద్ నుంచి కొందరు సమైక్యవాదులు తరలివెళ్ళినా, సభా ప్రాంగణంలోకి వారు చేరుకోలేకపోయారు. అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయి గనుక, సమైక్య శంఖారావంలో గ్రేటర్ హైద్రాబాద్‌కి చెందిన ప్రజలే ఎక్కువగా కన్పిస్తారని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఏదిఏమైనా, సమైక్య శంఖారావంను అడ్డుకుని తీరతామంటూ ప్రత్యేకవాదం ముసుగులో కొందరు చేస్తోన్న హెచ్చరికలు, సమైక్య శంఖారావం నిర్వహణపై అనుమానాలు పెంచుతున్నాయి. అయితే వైసీపీ చేస్తున్న ఏర్పాట్లు, ప్రజలకు జగన్ ఇస్తున్న పిలుపు, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారం.. ఇవన్నీ సమైక్య శంఖారావం సభను రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఓ మైలు రాయిగా నిలిపేలా చేస్తాయా.? వేచి చూడాల్సిందే.