అలాటి రాళ్లు వేయగల శక్తి టిడిపికి మాత్రమే వుంది. అదీ సోనియా ఫ్లెక్సీకి సమాధి కట్టేసిన ఆంధ్ర యూనిట్ వారికి మాత్రమే. తెలంగాణ టిడిపి యూనిట్‌వారు, తెరాసలాగే సోనియాను తిట్టడానికి తటపటాయిస్తున్నారు. చంద్రబాబు సమైక్యం అని నోటితో అనకపోయినా ఆంధ్ర టిడిపి నాయకులు మాత్రం తమను తాము సమైక్యవాదులుగా చూపుకుంటూ తక్కినవారిని విభజనవాదులని నిందిస్తున్నారు. సోనియా విభజన చేయడానికి నిశ్చయించుకుని, ఆ ప్రణాళికలో భాగంగానే జగన్‌కు బెయిల్ యిప్పించిందని, జైలు నుండి బయటకు రావడానికి ఆమె పావుగా వుండడానికి జగన్ ఒప్పుకున్నాడనీ వారు ప్రచారం చేస్తున్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలోని సమైక్యవాదులకు, ఆంధ్రమూలాలు వున్నవారికి ఛాంపియన్‌గా ఎదిగేందుకు వైకాపాకు ఎంత ఛాన్సుందో – టిడిపి కి కూడా అంతే వుండి వుండేది, చంద్రబాబు కూడా సమైక్యం వైపు తిరిగిపోయి వుంటే! ఇప్పటివరకు ఆయన తిరగలేదు కాబట్టి వైకాపాకు ఎక్కువ ఛాన్సు కనబడుతోంది.
అది టిడిపికి నచ్చుబాటుగా లేదు. అందువలన జగన్ సమైక్యవాది కాదు, విభజనవాది అనే ప్రచారం ఉధృతంగా చేస్తున్నారు వాళ్లు. ‘జగన్ పెదాలపై సమైక్యం, మనసులో విభజన’ అని వారు మనకు పదేపదే చెప్తున్నారు. దానికి కారణం ఏమిటో కూడా చెప్తున్నారు. ‘విభజన జరిగితే జగన్‌కి ఎక్కువ లాభం. ఎందుకంటే జగన్‌కు తెలంగాణలో బలం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. సీమాంధ్రలోనే కాస్త వుంది. రాష్ట్రం సమైక్యంగా వుంటే జగన్‌కు ఏ నాలుగో స్థానమో దక్కుతుంది. అదే విడిపోతే సీమాంధ్రలో రెండు, లేదా మూడో స్థానంలో వుండవచ్చు. అందువలన రాష్ట్రం విడిపోవాలని జగన్ మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాడు.’ అదీ వాళ్ల వాదన. దీనికి తోడు సోనియాతో కుమ్మక్కు పాయింటు కూడా వుంది. దాన్ని తిప్పికొట్టడానికి జగన్ ‘కుమ్మక్కు వుంటే 16 నెలలు జైల్లో వుంటానా?’ అని అడుగుతున్నారు. గతంలో యుపిఏకు మద్దతు యిస్తానని జగన్ అన్న విషయం గుర్తు చేసి సబ్బం శ్రీహరి, దాడి వైకాపా కార్యకర్తల కోపానికి గురయ్యారు. తనపై వున్న ఈ ఆరోపణ తుడిచేసుకోవడానికి జగన్ ‘సోనియా చేతిలో పావుగా వున్నది నేను కాదు, కిరణ్’ అని పెద్దపెట్టున దాడి చేస్తున్నారు. ‘‘సాక్షి’’ పేపరంతా రోజూ అదే న్యూస్. కిరణ్‌పై యీ ప్రత్యేక కోపం దేనికంటే యిప్పుడు సమైక్య ఛాంపియన్ అంటే కిరణే అని సామాన్యప్రజలందరూ నమ్ముతున్నారు. సమైక్యవాదుల హృదయంలోంచి కిరణ్‌ను తరిమివేస్తే తప్ప తనకు చోటు దక్కదని జగన్ తాపత్రయం.
కాంగ్రెసు పార్టీలో వుంటూ, సోనియాకు కోపం తెప్పిస్తే కొంప మునుగుతుందని తెలిసి కూడా కిరణ్ సాహసం చూపుతున్నారని స్థూలంగా చూస్తే అనిపిస్తూనే వుంది. సూక్ష్మంగా చూస్తే దాని వెనకాల కుట్ర వుంది, గమనించండి అని జగన్, టిడిపివారు మనల్ని పోరుతున్నారు. దానికి వీళ్లు చెప్పే కారణం ఏమిటంటే – అంత సమైక్యవాదే అయితే రాజీనామా చేయాలి కదా అని. గతంలో తెలంగాణ మంత్రులు రాజీనామా చేసినపుడు ఏం జరిగిందో చూశాం. అధిష్టానం చలించలేదు. పోయినవాళ్లు పోయారనుకుంది. మాజీమంత్రులయ్యాక వాళ్లు చెప్పేది ఎవరూ వినడం మానేశారు. కాంగ్రెసులో వున్నంతకాలం మీడియా కేకే, మందా వగైరాలను ఎంత కవర్ చేసిందో గమనించండి. ఒక్కసారి పార్టీలోంచి బయటకు వెళ్లగానే వాళ్ల నోళ్లు మూతబడ్డాయి. ఫలానా దానిపై మీ అభిప్రాయం ఏమిటి అని మీడియా కూడా అడగడం మానేసింది. రాజీనామా చేశాక కిరణ్‌దీ అదే పరిస్థితి. కీలకమైన పదవిలో వుండి అడ్డుపడితే ప్రభావం వుంటుంది తప్ప రిజైన్ చేస్తే చేసేదేముంది? రిజైన్ చేయలేదని నిందించడానికి వైకాపాకు నైతికపరమైన హక్కు వుంది కానీ టిడిపికి అస్సలు లేదు. వాళ్ల ఎంపీల రాజీనామాలన్నీ బోగస్ అని తేలిపోయింది. హరికృష్ణ ఒక్కరే నిజాయితీగా చేశారు. తక్కినవాళ్లందరూ వేషాలు వేశారు. శివ ప్రసాద్ లిటరల్‌గా వేషాలు వేశారు. అదేమిటంటే ‘మేం రిజైన్ చేసి ప్రయోజనం ఏముంది? కాంగ్రెసు వాళ్లు చేయాలి తప్ప..’ అంటున్నారు. ‘చేస్తే నష్టం ఏముంది?’ అని కానీ ‘అలాటప్పుడు దీక్షలు చేసీ ప్రయోజనం ఏముంది?’ అని కాని అడిగితే ఏవేవో కథలు చెప్తారు.
ఇంతకీ కిరణ్‌కానీ, జగన్ కానీ సోనియా చెప్పినట్టే ఆడుతున్నారా? వీరిలో ఎవరు కోవర్టు? ఎవరైనా కావచ్చు, ఎవరూ కాకపోవచ్చు. ఇప్పుడు కావచ్చు, రేపు కాకపోవచ్చు. ఎందుకంటే 2014 తర్వాత రాజెవడో, రంగడెవడో? సోనియా సారథ్యంలో కాంగ్రెసుకు, యుపిఏకు తగుపాటి సీట్లు వచ్చి మెజారిటీ కోసం అల్లాడినపుడు కదా వీళ్ల సపోర్టు తీసుకునేది! ఇప్పటివరస చూస్తూంటే కాంగ్రెసు మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎవరూ అనలేరు. మన్‌మోహన్ ప్రభుత్వం యావత్తు అవినీతిమయమై పోయిందని ఛీ కొడుతున్నపుడు, రాహుల్ గాంధీలో నాయకత్వ లక్షణాలు కనబడనప్పుడు, సోనియా అనారోగ్యం గురించి అందరికీ తెలిసిపోయినపుడు కాంగ్రెసు అధికారానికి చేరువలోనైనా వస్తుందన్న నమ్మకం కలగడం కష్టం. అంతమాత్రం చేత కాంగ్రెసు పూర్తిగా అడుగంటుతుందని అనలేము. రాష్ట్రస్థాయిలో కొందరు నాయకులు కొన్ని సీట్లు సంపాదించి పెడతారు. అవి చాలినన్ని రానపుడు యుపిఏ విచ్ఛిన్నం కావచ్చు. కాంగ్రెస్సే మూడో ఫ్రంట్‌కో, మరో దానికో మద్దతు యివ్వరావలసి రావచ్చు. భవిష్యత్తు ఎలా వుంటుందో తెలియదు కాబట్టే ఎవరూ తమ ఆప్షన్స్ ఫోర్‌క్లోజ్ చేసుకోవడం లేదు. ద్వారము తెరిచియే వుంచుతున్నారు.
కెసియార్ వారిలో ప్రథముడు. అందుకే విలీనం జాన్తా నై అంటున్నారు. పొత్తు చాల్లే అంటున్నారు. ఆయనతో పొత్తు అంటే అది సవ్యంగా సాగదని 2004, 2009 ఎన్నికలు రుజువు చేశాయి. భాగస్వామికి సీటు వదిలేశామంటారు, మళ్లీ తన పాటికి తను పార్టీ అభ్యర్థికి బి ఫారం యిచ్చి పంపిస్తారు. అడుగుదామంటే ఫామ్ హౌస్‌లోకి మాయమై పోతారు. ‘తెలంగాణ యిస్తానంటే ఎవరికైనా మొక్కుతాను’ అన్న కెసియారే యిలా వుంటే, జగన్ మాత్రం తన భవిష్యత్తును కాంగ్రెసుతో ముడి వేసుకుని కూర్చుంటారా? రేపు కేంద్రంలో ఎవరుంటే వారి చేతిలో సిబిఐ వుంటుందని జగన్‌కి తెలియదా? కేంద్రంలో మోదీ వుండే సినారియోను కూడా జగన్ ఊహించకపోలేదు. అందుకే ‘మతతత్వం వదులుకుంటే మోదీ పరిపాలనాదక్షుడే’ అని ఓ సర్టిఫికెట్టు పడేసి కూర్చున్నారు. వెంటనే మోదీ ‘దేవాలయాల కంటె శౌచాలయాలు ముఖ్యం’ అని ఓ స్టేటుమెంటు యిచ్చి నేనూ తక్కువ తినలేదని చూపుకున్నారు. మూడో ఫ్రంట్‌ను కూడా జగన్ దువ్వుతూనే వున్నారు. మొన్న చంద్రబాబు ఢల్లీలో నిరాహారదీక్ష చేసినపుడు సిపిఎం, ములాయం యిత్యాదులు తొంగి చూడకపోవడానికి కారణం జగన్‌తో లింకులే కారణం అనేవారూ వున్నారు. అబ్బే మోదీతో బాబు దోస్తీ చేయడమే కారణం అనేవారూ వున్నారు. ఏది ఏమైనా బాబు ఎటు వుంటే దానికి వ్యతిరేకదిశలో నడవడమే జగన్ లక్ష్యం. కానీ కేంద్రంలో వున్న వారితో బాబు దోస్తీ చేసి సిబిఐను ఉసికొల్పితే, జగన్ తన స్ట్రాటజీ మార్చుకోవచ్చు కూడా. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2013)