అల్లరి నరేష్‌తో ‘అహనా పెళ్లంట’, సునీల్‌తో ‘పూలరంగడు’ చిత్రాల్ని డైరెక్ట్ చేసిన వీరభద్రమ్ వెంటనే నాగార్జునలాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది. మొదటి రెండు సినిమాలు కామెడీలైనా, మూడో సినిమాతో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కిస్తున్న వీరభద్రమ్ చిన్న సినిమాల నుంచి స్టార్ సినిమా వరకు ఒకేసారి లాంగ్ జంప్ చేసి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. నాగార్జునకి టాలెంట్ స్పాట్ చేసే టాలెంట్ ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. నాగార్జున కేవలం వీరభద్రమ్‌కి దర్శకుడిగా అవకాశం ఇవ్వడమే కాకుండా, ఆయనే స్వయంగా ‘భాయ్’ని నిర్మిస్తున్నారు. దీంతో వీరభద్రమ్‌పై అందరికీ మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడని నాగార్జున నుంచి కితాబు అందుకున్న వీరభద్రమ్ ‘భాయ్’ చిత్రంతో తనపై నమ్మకం ఉంచిన నాగార్జునకి తప్పకుండా హిట్టిస్తానని గట్టిగా చెబుతున్నాడు. అతనితో గ్రేట్‌ఆంధ్ర జరిపిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ డీటెయిల్స్‌లోకి వెళితే…
దర్శకుడిగా మీ ప్రయాణం ఎలా మొదలైంది?
మాది పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు దగ్గర కలవలపల్లి అనే గ్రామం. వ్యవసాయ కుటుంబం. చిన్నప్పట్నుంచీ నాకు సినిమాలంటే ఇష్టం. ఎలాగైనా ఇండస్ట్రీకి వెళ్లి ఒక మంచి డైరెక్టర్‌ని కావాలని అనుకునేవాడిని. 1997లో హైదరాబాద్ వచ్చాను. అప్పుడు సాఫ్ట్‌వేర్ రంగం మంచి బూమ్‌లో ఉంది. నా స్నేహితులంతా కోచింగ్ సెంటర్స్‌లో జాయిన్ అయి, వరుసగా అందరూ మంచి మంచి ఉద్యోగాల్లో సెటిలవుతున్నారు. నేను కూడా ఆ టైమ్‌లో అటు స్టెప్ తీసుకుని ఉంటే ఈపాటికి సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో బాగా సెటిల్ అయి ఉండేవాడినేమో. కానీ నాకు ఎప్పుడూ కూడా సినిమా రంగం తప్ప మరో ఫీల్డులోకి వెళ్లాలనే ఆలోచన కలగలేదు. స్నేహితులంతా జీవితంలో సెటిల్ అయిపోతున్నా కానీ నేను మాత్రం సినిమా ఫీల్డ్‌లో అనుకున్న స్థాయికి చేరుకోవాలని అనుకున్నాను. ఆ టైమ్‌లో ఇవివి సత్యనారాయణగారు టాప్ డైరెక్టర్. ఆయన దగ్గర అవకాశం కోసం ఎంతోమంది పడిగాపులు పడేవారు. నేను కూడా వెళ్లి ఆయన దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్ కావాలని ప్రయత్నాలు మొదలుపెట్టాను. రెండు, మూడు సార్లు కలిసిన తర్వాత ఆయన నన్ను జాయిన్ చేసుకున్నారు. అలా ఆయన దగ్గర జాయిన్ అయిన తర్వాత చాలా చిత్రాలకి ఇవివిగారితో పని చేశాను. ఆ త్వాత డైరెక్టర్ తేజ దగ్గర ఫ్యామిలీ సర్కస్ నుంచి నిజం సినిమా వరకు కో డైరెక్టర్‌గా చేశాను. శంకర్‌దాదా ఎంబిబిఎస్‌కి కూడా కో డైరెక్టర్‌గా వర్క్ చేశాను. కృష్ణవంశీగారి దగ్గర డేంజర్ సినిమాకి చేశాను, ఇంకా చాలా మంది పెద్ద, చిన్న దర్శకుల దగ్గర పని చేశాను. 97లో వచ్చినప్పట్నుంచీ, ఇంచుమించుగా పది సంవత్సరాల పాటు నేను దర్శకత్వ శాఖలో పని చేశాను.
డైరెక్టర్‌గా అవకాశం ఎలా వచ్చింది?
2007లో రసూల్‌గారి దర్శకత్వంలో గద్దె సిందూర నటించిన ‘సంగమం’ చిత్రానికి కో డైరెక్టర్‌గా పని చేస్తున్నప్పుడు, మా యూనిట్ యుఎస్ వెళ్లింది. తెలుగు సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిసే సరికి అక్కడ ఉన్న ఎన్నారైలు షూటింగ్ చూడ్డానికి వచ్చేవాళ్లు. వాళ్లలో కొంతమందితో పరిచయం ఏర్పడి, నేను రాసుకున్న కథలు కొన్ని చెప్తుండేవాడిని. నేను కథ చెప్పే విధానం నచ్చి చికాగోలో ఉన్న అనిల్ సుంకరకి ఆయన స్నేహితుడు ఒకరు ఫోన్ చేసి నా గురించి చెప్పారు. ఆయన అప్పటికే సినిమాలు నిర్మించాలనే ఆలోచనలో ఉండడం వల్ల తన ఫ్రెండ్స్ ఇద్దరితో పాటు వచ్చి కలిశారు. ఆయనకో కథ చెప్పాను. నేను చెప్పిన విధానం నచ్చడంతో ‘గ్యారెంటీగా సినిమా చేద్దాం’ అని అనిల్‌గారు అన్నారు. సినిమా చేద్దామని ఫిక్స్ అయిన తర్వాత ఓ పాపులర్ యంగ్ హీరోని కలిసి కథ చెప్పాను. అతను కథ నచ్చిందని చెప్పేవాడు కానీ అడ్వాన్స్ తీసుకునేవాడు కాదు. అయిదారు నెలలు అతని చుట్టూ తిరిగాం. ఒక టైమ్‌లో అనిల్ సుంకరగారు కూడా ఏం చేస్తాంలే ఈ సినిమా అనేంతగా విసిగిపోయారు. అప్పటికే ఆయన బిందాస్, నమో వెంకటేశ కూడా మొదలు పెట్టేశారు. ముందుగా నాతో సినిమా చేద్దామని అనుకున్న ఆయన దాని కంటే ముందు రెండు సినిమాలు స్టార్ట్ చేశారు. నేను కూడా ఆ టైమ్‌లో ‘నమో వెంకటేశ’కి కో డైరెక్టర్‌గా వెళ్లిపోదామని అనుకున్నాను. అయితే ఓ సందర్భంలో నరేష్‌ని కలిసినప్పుడు నా కథ నరేష్‌కి అయినా బాగుంటుంది కదా అనిపించింది. అయితే లవ్‌స్టోరీలో నరేష్ ఏంటని చాలా మంది డౌట్ పడ్డారు. కానీ నాకు కాన్ఫిడెన్స్ ఉండడంతో అందర్నీ కన్విన్స్ చేసి ఒప్పించాను. అలా ఓ ఉగాది రోజున ‘అహనా పెళ్లంట’ షూటింగ్ స్టార్ట్ అయింది. 2001లో ఒకసారి, 2005లో ఒకసారి దర్శకుడిగా అవకాశాలొచ్చి మిస్ అయ్యాయి. అలాగే ఇది కూడా ఏడాదికి పైగా టైమ్ తీసుకునేసరికి ఈసారి కూడా మిస్ అవుతున్నానేమో అనుకున్నాను. ఒక్క సినిమా అయినా చేసి దర్శకుడిగా నన్ను నేను నిరూపించుకోవాలని చాలా కసిగా ప్రయత్నించాను. అహనాపెళ్లంట సినిమా సెట్స్ మీదకి వెళ్లడానికి ముందు మొత్తం ముప్పయ్ అయిదు సార్లు ఫుల్ నెరేషన్ పలువురికి ఇచ్చాను. ఎంతో కష్టపడ్డాను. ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని బాబా ఆ సినిమా విజయంతో అందించాడని నేను భావిస్తున్నాను.
కొరియన్ మూవీ ‘మ్యారీయింగ్ ది మాఫియా’ స్ఫూర్తితో ‘అహనా పెళ్లంట’ తీశారా?
కాదండీ. చాలా మంది అలా అన్నారు… ‘మీ సినిమా ఆ సినిమాలా ఉంది. ఈ సీన్ ఇందులో ఉంది’ అని. ప్రతి హిట్ సినిమాకీ ఈ టాక్ వినిపిస్తూనే ఉంటుంది. ఏ సినిమాకి అయినా కానీ ఏదో ఒక సినిమాతో పోలిక వస్తుంది. ఫైనల్‌గా సక్సెస్‌ఫుల్ సినిమా తీశామా లేదా అనేది మాత్రమే కౌంట్ అవుతుంది.
‘భాయ్’ కూడా మలయాళ చిత్రం ‘తేజా భాయ్ అండ్ ఫ్యామిలీ’కి రీమేక్ అని ప్రచారం జరుగుతోంది.
దానికీ, భాయ్‌కీ అస్సలు సంబంధం లేదండీ. సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. భాయ్ చూస్తుండగా మీకేదైనా ఆ సినిమాలో ఉన్నట్టు అనిపిస్తే నాకు ఫోన్ చేయండి (నవ్వుతూ). ఈ భాయ్ టైటిల్ నేను ఇప్పుడు అనుకున్నది కాదు. ‘శంకర్‌దాదా ఎంబిబిఎస్’కి కో డైరెక్టర్‌గా చేస్తున్నప్పుడు ఆ సినిమాకే భాయ్ అనే టైటిల్ పెడితే బాగుంటుంది అనిపించింది. అది ‘మున్నాభాయ్’ సినిమాకి రీమేక్ కాబట్టి తెలుగులో కూడా టైటిల్ భాయ్ అని ఉంటే బాగుంటుంది అనుకున్నాను. అలా భాయ్ టైటిల్‌తో సినిమా చేయాలని అప్పుడే అనుకున్నాను. నా అదృష్టం కొద్దీ ఈ టైటిల్‌తో ఇంతవరకు ఎవరూ సినిమా చేయలేదు. ఈ టైటిల్ నాగార్జునగారికి అయితే బాగుంటుందని కూడా అప్పుడే అనుకున్నాను. ఈ టైటిల్ వేరే బ్యానర్‌పై రిజిష్టర్ చేయించి, నాగార్జునగారిని కలిసి కథ చెప్పడానికి ప్రయత్నాలు కూడా చేశాను. కానీ అప్పుడు కుదర్లేదు. చివరిగా ఇలా ఆ టైటిల్‌తో నాగార్జునగారితోనే సినిమా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.
రెండు కామెడీ సినిమాలు చేసిన తర్వాత ఒక స్టార్ హీరోకి కమర్షియల్ కథ చెప్పి ఒప్పించడం కష్టమైన విషయం. నాగార్జునగారిని ఎలా అప్రోచ్ అయ్యారు, ఆయనకి కథ చెప్పి ఎలా కన్విన్స్ చేయగలిగారు?
నేను తీసిన మొదటి రెండు సినిమాల జోనర్ కామెడీ అయినా కానీ నేను అందులో నా హీరోలని కామెడీగా చూపించలేదు. హీరోల్లానే చూపించాను. అహ నా పెళ్లంటలో నరేష్ ఎక్కడా ఊర కామెడీ చేయడు. చాలా డిగ్నిఫైడ్‌గా, హీరోలా కనిపిస్తూ ఎంటర్‌టైన్ చేస్తాడు. అలాగే పూలరంగడులో కూడా సునీల్ ఇంట్రడక్షన్ దగ్గర్నుంచి, లాస్ట్ ఫైట్ వరకు అంతా ఒక కమర్షియల్ హీరోని చూపించినట్టు చూపించాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే… ఇప్పుడు ఏం తీశామన్నది కాదు, హీరోని ఎలా చూపించామన్నది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా నాగార్జున గారికి బాగా నచ్చాయి. భాయ్ కథ ఆయనకి నెరేట్ చేసినప్పుడు గంటన్నరకి పైగా చెప్పాను. చాలా ఎమోషనల్ కథ ఇది. నాలుగైదేళ్లు కష్టపడి కథ డెవలప్ చేసినప్పుడు తప్పకుండా ఆ ఎఫర్ట్ స్టోరీలో తెలుస్తుంది. కథ రాయడం ఈజీనే, సక్సెస్‌ఫుల్ కథ తయారు చేయడం చాలా కష్టం. అంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న స్టార్‌కి కథ విన్నప్పుడు అది వర్కవుట్ అవుతుందా లేదా అనేది తెలిసిపోతుంది. భాయ్ కథ వినగానే తప్పకుండా మనం ఈ సినిమా చేద్దామని నాగార్జునగారు అన్నారు.
ఈ కథ చాలా కాలం క్రితం రాశానని అన్నారు. ఎన్నోసార్లు నాగార్జునని కలవడానికి ట్రై చేసినా కుదర్లేదని చెప్పారు. మరి ఆ టైమ్‌లో మీ దగ్గరున్న కథని వేరే ఏ హీరోతో అయినా చేద్దామని ప్రయత్నించలేదా?
నాకైతే ఈ కథకి వేరే హీరో ఎవరూ కనిపించలేదండీ. నాగార్జునగారు ఒక డిఫరెంట్ యాక్టర్. ఆయనలో క్లాస్ హీరో ఉంటాడు. ఒక మాస్ హీరో ఉంటాడు. అందుకే ఇందులో ఒక పాట కూడా పెట్టాం.. ‘వీడు క్లాసు.. వీడు మాసు’ అని. ఈ రెండు డైమెన్షన్స్ ఉన్న హీరో ఆయన. అటు మన్మథుడులాంటి క్లాస్ సినిమాలతో ఆకట్టుకున్నారు. శివలాంటి మాస్ సినిమాలతో కూడా సూపర్‌హిట్స్ సాధించారు. ఈ రెండు డైమెన్షన్స్ ఉన్న కథ ఇది. అందుకే భాయ్ కథకి ఆయన తప్ప వేరే ఎవరూ సెట్ అవుతారని నాకైతే అనిపించలేదు.
నాగార్జునని ఇంతవరకు చాలా మంది చాలా రకాలుగా చూపించారు. ఆయన విభిన్నమైన పాత్రలు చాలా పోషించారు. మీరిందులో కొత్తగా ఏం చూపించబోతున్నారు?
నాగార్జునగారు భాయ్ చేస్తానని చెప్పగానే నేను ఫస్ట్ ఆలోచించింది అదే. నాగార్జునలాంటి స్టార్ హీరో నాకు డేట్స్ ఇచ్చారు. ఆయనే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తానన్నారు. ఆయన్ని నేను కొత్తగా ఎలా చూపించాలనే దాని గురించి చాలా ఆలోచించాను. ఆయన క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. ‘బిఫోర్ సిక్స్ భాయ్… ఆఫ్టర్ సిక్స్ ప్లేబాయ్’ అనే డైలాగ్ వినే ఉంటారు. ఏదో డైలాగ్ బాగుందని పెట్టింది కాదు. ఇందులో ఆయన క్యారెక్టరైజేషన్ అలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆయన ఇందులో మాట్లాడే విధానం చాలా కొత్తగా ఉంటుంది. ఆయన చెప్పే ప్రతి డైలాగ్ ఠక్కున వచ్చి ఆడియన్స్‌కి తగుల్తుంది. వీరభద్రమ్ నాగార్జునతో ఒక సినిమా చేశాడు అనే దాని కోసం నేను ప్రయత్నించలేదు. నాగార్జునని వీరభద్రమ్ చాలా కొత్తగా చూపించాడు అనిపించుకోవడానికి చాలా కృషి చేశాను.
ఈ భాయ్ బుల్లెట్స్ ఏంటండీ? సినిమాలో ఉన్న డైలాగ్స్ అన్నీ ముందే చెప్పేసినట్టున్నారు. ఇక సినిమాలో ఏమైనా మిగిలాయా లేదా?
(నవ్వుతూ) ఈ భాయ్ బుల్లెట్స్ వెనుక ఏడెమినిది నెలల కృషి ఉంది. ఈ క్యారెక్టరైజేషన్ అనుకున్నప్పుడే చాలా డైలాగ్స్ వచ్చేశాయి. నాగార్జునగారికి చెప్పినప్పుడు ఆయన కూడా డైలాగ్స్‌ని బాగా మెచ్చుకున్నారు. ఈ డైలాగ్స్‌ని భాయ్ బుల్లెట్స్ అని ప్రచారం చేస్తే బాగుంటుంది అనిపించింది. అది బాగా క్లిక్ అయింది. ఇప్పుడెవరైనా మా సినిమా గురించి మాట్లాడితే ‘భాయ్’ బుల్లెట్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంకా సినిమాలో చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి. ఎన్నో పవర్‌ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. మేం ఆల్రెడీ వాడిన బుల్లెట్స్ కంటే వదలకుండా దాచిన బుల్లెట్స్ ఇంకా బాగా పేలతాయి.
ఫస్ట్ రెండు సినిమాల్లో కామెడీ బాగా పండించారు కాబట్టి ఈ సినిమాలో కూడా కామెడీ బాగుంటుందని అనుకోవచ్చా?
తప్పకుండా అండీ. ఇందులో హిలేరియస్ కామెడీ ఉంటుంది. బ్రహ్మానందంగారి క్యారెక్టర్ సెకండ్ హాఫ్‌లో ఎంటర్ అవుతుంది. ఆయన పాత్ర ఒక్కటనే కాదు… ఇందులో అందరూ నవ్విస్తారు. సినిమా అంతటా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది.
ఈ సినిమాతో హ్యాట్రిక్ కంప్లీట్ చేస్తాననే ధీమా మీ మాటల్లో కనిపిస్తోంది
నాగార్జునగారు నా మీద ఉంచిన నమ్మకానికి న్యాయం చేయాలని చాలా కష్ట పడ్డాను. మొత్తం టీమ్ అంతా హిట్ సినిమా తీయాలనే లక్ష్యంతో కృషి చేశారు. మేము అనుకున్న విధంగా సినిమా తెరకెక్కిందని, తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. ఇక ప్రేక్షకుల తీర్పు కోసం ఎదురు చూస్తున్నాను.
భాయ్‌తో డైరెక్టర్‌గా మీ రేంజ్ పెరుగుతుందని అనుకుంటున్నారా?
నరేష్‌తో నా కెరీర్ స్టార్ట్ అయింది. ఇవాళ నాగార్జునగారి వరకు వచ్చింది. జీవితంలో ప్రతి ఒక్కరూ ఇంకా ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటారు. నేను కూడా అలాగే ఈ సినిమాతో మరో మెట్టు పైకెక్కాలని ఆశిస్తున్నాను. కన్‌ఫర్మ్‌గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను.
భాయ్‌తో డైరెక్టర్‌గా మీ రేంజ్ పెరుగుతుందని అనుకుంటున్నారా?
నరేష్‌తో నా కెరీర్ స్టార్ట్ అయింది. ఇవాళ నాగార్జునగారి వరకు వచ్చింది. జీవితంలో ప్రతి ఒక్కరూ ఇంకా ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటారు. నేను కూడా అలాగే ఈ సినిమాతో మరో మెట్టు పైకెక్కాలని ఆశిస్తున్నాను. కన్‌ఫర్మ్‌గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను.
నాగార్జున మీకు డేట్స్ ఇవ్వడం మీ వరకు ఒక అఛీవ్‌మెంట్ అనుకుంటే, ఆయనే దీనిని ప్రొడ్యూస్ చేయడానికి కూడా ముందుకి రావడం ఎలా అనిపించింది?
నా కథ నాగార్జునగారు ఓకే చేశారని తెలిసినప్పుడు చాలా మంది నిర్మాతలు ఈ సినిమా నిర్మించడానికి ఆసక్తి చూపించారు. కానీ నాగార్జున మాత్రం ఈ చిత్రాన్ని తానే నిర్మిస్తానని అన్నారు. ‘ఈ సినిమాకి పెద్ద స్పాన్ అవసరం.. ఎక్కువ లొకేషన్లు, చాలా మంది ఆర్టిస్టులు కావాలి. వేరే నిర్మాతల చేతిలో పెడితే వాళ్లు సమయానికి పూర్తి చేయకపోవచ్చు, విడుదల సమయంలో ఏమైనా డిలేస్ జరగవచ్చు’ అని చెప్పి ఆయనే నిర్మిస్తానని అన్నారు. నాగార్జునగారితో సినిమా చేయడమే పెద్ద వరం అనుకుంటే, అన్నపూర్ణా స్టూడియోస్‌లాంటి సంస్థలో ఆ సినిమా చేయడం కంటే ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. ఆయన నిర్మాత కావడం వల్ల ఎక్కడా రాజీ పడలేదు. దర్శకుడిగా నాకు ఏది అవసరం అని అనుకున్నానో అన్నీ సమకూర్చారు. చాలా మంది టాప్ ఆర్టిస్టులు ఈ చిత్రంలో నటించారు. కోటిన్నర వ్యయంతో సెట్ వేయించారు. స్లోవేనియాలాంటి దేశాల్లో ఎవరూ షూటింగ్ చేయని లొకేషన్స్‌లో షూటింగ్ చేశాం. ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు. వేరే ప్రొడ్యూసర్ అయితే ఖర్చు పెరుగుతుందని నేను అడిగిన వారితో చేయడానికి వెనుకాడి ఉండేవారు. కానీ నాగార్జునగారు ఏ విషయంలోను నాకు అడ్డు చెప్పలేదు. నిర్మాతగా ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. 100 రోజుల్లో షూటింగ్ పూర్తి చేద్దామని అనుకున్నాం. 94 రోజుల్లోనే పూర్తి చేశాం. అనుకున్న బడ్జెట్‌లోనే తీశాం.
భాయ్ బడ్జెట్ ఎంతయిందండీ?
ఇరవై ఒక్క కోట్లలో ఈ చిత్రం పూర్తయింది. ఈ సినిమా స్పాన్‌కి అనుకున్న దానికంటే తక్కువకే సినిమా కంప్లీట్ అయింది.
ట్రెండ్‌సెట్టర్ డైలాగ్ ‘గబ్బర్‌సింగ్’లోని డైలాగ్‌కి సెటైర్ అని కామెంట్ ఉంది. దీనిపై మీ స్పందన?
(బిగ్గరగా నవ్వేస్తూ) అసలు దానికీ, దీనికీ సంబంధమే లేదండీ. ‘శివ’ సినిమాతో నాగార్జున ట్రెండ్ సెట్ చేశారు. అప్పట్నుంచీ ఆయనని ట్రెండ్‌సెట్టర్ అంటారు. దానికీ, భాయ్‌కీ లింక్ చేస్తూ ఆ డైలాగ్ పెడితే బాగుంటుందని అనిపించి రాసుకున్నదే కానీ ఎవరినీ టార్గెట్ చేసిన డైలాగ్ కాదు. ఈ కథ నాగార్జున గారితో చేయాలని అనుకున్నప్పుడు అయిదారు సంవత్సరాల క్రితం రాసుకున్న డైలాగ్ అది. అసలు ఒక డైరెక్టర్‌గా అందరి హీరోలతో పని చేయాలని అనుకునే నేను ఒక హీరో గురించి ఎక్కువ మాట్లాడి, మరొకరి గురించి తక్కువ మాట్లాడ్డం ఎలా చేస్తాను? రేపు ఎవరైనా నాకు అవకాశం ఇవ్వవచ్చు. అదే పవన్‌కళ్యాణ్‌గారితో, అదే మహేష్‌బాబుతో నాకు అవకాశాలు రావచ్చు. అలాంటప్పుడు ఎవరి గురించి అయినా ఎందుకు కామెంట్ చేస్తాను? సినీ పరిశ్రమ చాలా చిన్నది. ఇక్కడ ఉన్న ఆ కొంతమంది హీరోలతోనే, ఏ దర్శకులైనా పని చేసుకోవాలి. అలాంటప్పుడు నేనే కాదు, ఏ దర్శకుడు కూడా వేరే హీరోపై సెటైర్స్ వేయరు. ఇది కేవలం కొందరి అపోహే తప్ప ‘భాయ్’లో ఆ డైలాగ్ ఎవరినీ ఉద్ధేశించింది కాదు.
మీ నెక్స్‌ట్ మూవీ రవితేజతో ఉంటుందనే టాక్ ఉంది…
ఎవరితో ఉంటుందనేది త్వరలోనే చెప్తాను. ప్రస్తుతానికి భాయ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను… అంటూ ఇంటర్వ్యూ ముగించారు వీరభద్రమ్.
– గణేష్ రావూరి
Feedback at:
[email protected]
twitter.com/ganeshravuri