కేసీఆర్ ప్రభుత్వం భలే చిత్రంగా ప్రవర్తించినట్లు కనిపిస్తోంది. ఆంధ్ర నుంచి తెలంగాణలోకి వచ్చిన లొల్లి మాకెందుకు, మీరే చూసుకోండి అన్నట్లుగా, నేరుగా అక్కడికే తోసేసారు. శ్రీరాముడిని తన చిత్తానికి దూషించిన కత్తి మహేష్ ను తెలంగాణ బహిష్కరణ శిక్షకు గురిచేసారు. హైదరాబాద్ బహిష్కరణ అని వార్తలు వెలువడ్డాయి.
కేవలం హైదరాబాద్ బహిష్కరణ అయితే ఆంధ్ర పోలీసులకు అప్పగించడం, కత్తి మహేష్ స్వస్థలమైన చిత్తూరు పంపించడం ఎందుకు? హైదరాబాద్ సరిహద్దులు దాటించి వదిలేయవచ్చుగా? చుట్టూ చాలా ఊళ్లు వున్నాయి, అక్కడ వుండమని అనొచ్చుగా. ఇదేదో చిత్రమైన వ్యవహారంగా వుంది.
కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అనేటట్లు వుంది ఇదంతా. కత్తి మహేష్ సామాజికవర్గం జనాలు ఆంధ్రలో కన్నా తెలంగాణలో ఎక్కువ. అందువల్ల అతగాడి మీద ఏమైనా చర్య తీసుకుంటే, ఎటుపోయి ఎటొస్తుందో అని అనుమానం. అలా అని వదిలేస్తే, హిందూత్వ వ్వవహారం ముదురుతోంది. అది భాజపాకు లాభిస్తుంది.
అందుకే ఈ మధ్యేమార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు చిత్తూరులోనో, తిరుపతిలోనో మహేష్ గడబిడ చేస్తే ఏమిటి? అయినా బాబును ఇరుకున పెట్టేలా మన చానెళ్లు వ్యవహరించవు. ఆంధ్రలో వుండగా కత్తి మహేష్ ను పొరపాటున కూడా ఎంటర్ టైన్ చేయవేమో? మొత్తానికి బాల్ వెళ్లి బాబుగారి కోర్టులో పడింది.