తన బయోపిక్‌ను పూర్తిగా తనకు అనుకూలంగానే తీయించుకున్నాడు సంజయ్ దత్. ఇప్పటికే చాలా వయసు వచ్చేసిన నేపథ్యంలో ఇక బ్యాడ్ బాయ్ ఇమేజ్ ను పూర్తిగా పోగొట్టుకుని శేష జీవితాన్ని మంచోడిగా గడపాలనే లెక్కతో దత్ ఈ సినిమాను తీయించుకున్నట్టుగా ఉంది. సంజూ ఇమేజ్ మేకోవర్ కోసం ఈ సినిమాను రూపొందించారని స్పష్టం అయ్యింది. సంజూ జీవితంలో చేసిన తప్పులన్నింటికీ ఎవరో వేరే వాళ్లు అంతా కారణం అని తేల్చి చెప్పారు. జరిగిందేదో జరిగిపోయింది. చేసిన పొరపాట్లకు దత్ చాలా మూల్యమే చెల్లించుకున్నాడు కూడా.
అదలా ఉంటే.. సంజూ సినిమా వసూళ్ల విషయంలో దూసుకుపోతోంది. ఇప్పటికే గ్రాస్ వసూళ్ల విషయంలో 200 కోట్ల రూపాయల మార్కును దాటేసిన ఈ సినిమా 250 కోట్ల రూపాయల దిశగా పయనిస్తోంది. తద్వారా ప్రీ రిలీజ్ మార్కెట్ లెక్కలను అధిగమించేస్తోంది సంజూ. దీంతో దీని నిర్మాతలకు, పంపిణీదారులకు లాభాల పంట పండినట్టే అని విశ్లేషకులు అంటున్నారు.
ఆ లాభాలు వారికి మాత్రమే కాదట.. ఈ సినిమా కథపై హోల్ సేల్ రైట్స్ ను కలిగి ఉన్న సంజయ్ దత్ కు కూడా కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయని సమాచారం. దత్ జీవిత కథను సినిమా తీయడానికి రాజ్‌కుమార్ హిరాని అండ్ కో ఏకంగా పది కోట్ల రూపాయల మొత్తాన్ని ఆ హీరోకి ఆఫర్ చేసిందట. అతడి అనుమతి మేరకు తీసిన ఈ సినిమా కథ కోసం అతడికి పది కోట్ల రూపాయల డబ్బును ఇచ్చారట. ఇలా తన ఇమేజ్ మేకోవర్ కు పని కొచ్చే సినిమా కోసం దత్ పది కోట్ల రూపాయలను పొందడం విశేషమే.
అంతేగాక ఈ సినిమా లాభాల్లో కూడా వాటా ఇస్తామని వీరు అప్పట్లోనే సంజూకు ప్రామిస్ చేశారట. ఇప్పుడు ఎలాగూ సంజూ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది కాబట్టి దత్‌కు సంజూ వసూళ్ల నుంచి లాభాల వాటా అందుతోందని తెలుస్తోంది. మొత్తానికి సంజయ్ దత్ నక్క తోకను తొక్కినట్టుగా ఉన్నాడు.