బాలీవుడ్ లో ప్రకటనలేమీ లేకుండా పెళ్లి పీటలెక్కే సంప్రదాయాలు కొనసాగుతూ ఉన్నాయి. గత కొన్నేళ్లలో పలువురు హీరో-హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని దాంపత్యంలోకి అడుగుపెట్టాయి. ప్రేమికులుగా వీరు హడావుడి చేశారు మొదట. బాహాటంగా చట్టాపట్టాలేసుకు తిరిగారు. అయితే పెళ్లి గురించి మాత్రం ఎలాంటి లాంఛన ప్రకటన కూడా చేయలేదు!
కామ్ గా పెళ్లికి ఏర్పాటు చేసుకోవడం, బాగా కావాల్సిన వారిని ఆ వేడుకకు పిలుచుకోవడం, పెళ్లి చేసేసుకోవడం! ఈ తరహా కొనసాగుతూ ఉంది. తాము పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఏ సోషల్ మీడియాలో కూడా చెప్పకుండానే బాలీవుడ్ హీరోహీరోయిన్లు పెళ్లి పీటలెక్కేస్తూ ఉన్నారు. మరి ఈ క్రమంలోనే మరో జంట దాంపత్య జీవనంలోకి అడుగుపెట్టబోతోందనే టాక్ వినిపిస్తోందిప్పుడు.
ఈ సారి మరెవరో కాదు..కియరా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా. వీరిద్దరూ ప్రేమికులుగా ఇప్పటికే కావాల్సినంత ప్రచారం పొందారు. కలిసి నటిస్తూ, ప్రేమను కొనసాగిస్తున్న ఈ జంట… ఇప్పుడు తమ బంధాన్ని మరో లెవల్ కు తీసుకెళ్లబోతోందని తెలుస్తోంది. వీరిద్దరూ ఈ ఏడాది డిసెంబర్లో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఎలాంటి ప్రకటన లేకుండా, పెద్దగా హడావుడి లేకుండా ఈ జంట తమ వివాహానికి ఏర్పాట్లు చేయించుకుంటోందట. కావాల్సిన వారిని పిలుచుకుని ఈ ఏడాది డిసెంబర్లోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్టుగా రూమర్లు వినిపిస్తున్నాయి.
విశేషం ఏమిటంటే..ఇలాంటి రూమర్లే ఇటీవల నిజం అయ్యాయి. కత్రినాకైఫ్- విక్కీ కౌశల్, అలియాభట్ -రణ్ బీర్ కపూర్ ల వివాహాలు ఇలానే జరిగాయి. మరి ఆ పరంపరలో సిద్ధార్థ్- కియరాల పెళ్లి కూడా జరగడంలో పెద్ద ఆశ్చర్యం లేదు.