సంచలనం సృష్టిస్తున్న తన సినిమా 'కాంతార'ను మరో భాషలో రీమేక్ చేయడానికి తను సిద్ధంగా లేనంటున్నాడు దాని సృష్టికర్తి రిషబ్ షెట్టి. కన్నడలో మొదలుపెట్టి.. దేశమంతటా సంచలన స్థాయి వసూళ్లు సాధిస్తున్న తన సినిమా విజయం పట్ల ఈ దర్శకుడు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. తను ఫలితం గురించి ఆలోచించే టైపు కాదని, తన సినిమా ఇలా బాగా ఆడుతున్నందుకు సంతోషంగా మాత్రం ఉందని ఈ దర్శకుడు స్పందించాడు.
ఈ సినిమాను హిందీలో ఎవరు రీమేక్ చేస్తే బాగుంటుంది? అనే అంశంపై ఈ దర్శకుడు స్పందిస్తూ, దీనికి న్యాయం చేయగల ప్రతిభావంతులు బాలీవుడ్ లో చాలా మందే ఉన్నారని, అయితే రీమేక్ అనే కాన్సెప్ట్ తనకంత నచ్చదని ఈ దర్శకుడు వ్యాఖ్యానించాడు. ఇలా కాంతార రీమేక్ పట్ల ఒరిజినల్ దర్శకుడు అనాసక్తిని ప్రదర్శించాడు.
ఇది వరకూ కన్నడలో బాగా ఆడిన పలు సినిమాలు రీమేక్ లకు ఒరిజినల్ లను తీసిన దర్శకులే ముందుకు వచ్చారు. అందుకు భిన్నంగా కాంతార దర్శకుడు తను తన సినిమాను రీమేక్ చేయనంటున్నాడు. కాంతార కన్నడ వెర్షన్ తెలుగులోకి అనువాదం అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటోంది. ఈ సినిమాకు ప్రధానంగా తెలుగు నాట నుంచినే మంచి ఆదరణ లభిస్తూంది.
పాన్ ఇండియా సినిమాగా కాంతార ప్రచారానికి నోచుకుంటున్నప్పటికీ.. హిందీ బెల్ట్ లో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చిన వార్తలు వచ్చినప్పటికీ.. రీమేక్ తో వసూళ్ల పొటెన్షియాలిటీకి అవకాశం ఉన్న సినిమా ఇది. ఒకసారి అనువాదం అయిన సినిమాలను కూడా మళ్లీ అదే భాషలో రీమేక్ చేసే సంప్రదాయాలు ఇప్పుడున్నాయి.
తెలుగు, హిందీ సినిమా వాళ్లు ఆల్రెడీ అనువాదం అయిన సినిమాలను కూడా రీమేక్ చేస్తున్నారు. తెలుగులో అయితే కాంతార రీమేక్ కు ఇక స్కోప్ లేనట్టే. బాలీవుడ్ లో అవకాశం ఉందనుకున్నా.. ఒరిజినల్ ను చిత్రీకరించిన దర్శకుడే అనాసక్తిని వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
ఇక తన సినిమాను ఆస్కార్ కు పంపించాలన్న ప్రతిపాదన పట్ల కూడా రిషబ్ షెట్టి స్పందించాడు. ఈ మేరకు ట్వీట్లు తనకు ఉత్సాహాన్ని ఇస్తున్నాయని, అయితే తను ఫలితాల గురించి ఆలోచించే టైపు కాదంటూ ఈ దర్శకుడు స్పష్టం చేశాడు.