వారు రామభక్తులం అంటుంటే.. తను హనుమాన్ భక్తుడినంటూ ప్రకటించుకుని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి చెమటలు పట్టించాడు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. ప్రకటించుకోవడమే కాదు.. ఆ ఎన్నికల్లో ఘన విజయం కూడా సాధించాడు.
అప్పట్లోనే కేజ్రీవాల్ ది సాఫ్ట్ హిందుత్వ అనే విశ్లేషణ వినిపించింది. బీజేపీని ఎదుర్కొనడానికి కాంగ్రెస్ లా మూర్ఖపు పద్ధతిని కేజ్రీవాల్ ఫాలో కావడం లేదని, చాలా తెలివిగా అడుగులు వేస్తున్నాడని అలా స్పష్టత వచ్చింది. ముల్లును ముల్లుతోనే తీయాలనే పద్ధతిని కేజ్రీవాల్ ఫాలో అవుతున్నాడు.
సమాజంలోని వివిధ వర్గాలకు చేరువకావడానికి తన కులం అంశాన్ని కూడా కేజ్రీవాల్ బాహాటంగా ప్రస్తావించారు. తన తత్వానికి, కులానికి కూడా ముడిపెట్టి తన పని చేసుకున్నాడు! ఇక ఇటీవల మరో అడుగు ముందుకేసి.. భారత కరెన్సీ నోట్లపై వినాయకుడు, లక్ష్మీ దేవి ఫొటోలను ప్రచురించాలంటూ డిమాండ్ చేశారు. అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని, శుభమంగళకరం అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు!
దేశంలో ఇలాంటి వాదనలు ట్రెండింగ్ లో ఉంటున్నాయి! వీటిని హేతువాదులు, కాస్త ఆలోచన పరు తప్పు పట్టవచ్చుగాక! ఇలాంటి వాదనలే వినిపించి.. బీజేపీ వాళ్లు ప్రతి రాష్ట్రంలోనూ పాగా వేస్తున్నప్పుడు కేజ్రీవాల్ కూడా అదే బాటనే ఎంచుకుంటే అందులో ఆశ్చర్యం ఏముంది?
బీజేపీ నేతలు, కాషాయధారులు ఇదే మాటే చెబితే.. అవి ట్రోల్ కావడం లేదు, ట్రెండ్ అవుతున్నాయి. దీంతో కేజ్రీవాల్ కూడా ఇలాంటి మాటలను చెప్పి పాగా వేసే ప్రయత్నాలను పెంచుతున్నారు. ఇదే క్రమంలో మరో అంశాన్ని ఆయన గుజరాత్ లో ప్రస్తావించారు.
యూనిఫామ్ సివిల్ కోడ్ ఏమైంది? అంటూ కేజ్రీవాల్ ప్రశ్నిస్తున్నారు. దేశంలో కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా… అందరికీ ఒకే చట్టం వర్తించాలనే యూనిఫామ్ సివిల్ కోడ్ ఏమైంది? ఈ విషయంలో బీజేపీ ఏం చేస్తోంది? అంటూ కేజ్రీవాల్ గుజరాత్ లో ప్రశ్నించారు. ఇది వరకూ వేరే రాష్ట్రాల ఎన్నికలప్పుడు బీజేపీ వాళ్లు యూసీసీని ప్రస్తావించారని.. ఆ రాష్ట్రాల ఎన్నిలలు అయిపోగానే దాన్ని అటకెక్కించారని కేజ్రీవాల్ గుర్తు చేస్తున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల ముందు యూసీసీని ప్రస్తావిస్తారా?
దాన్ని వచ్చే ఎన్నికల సమయంలో వాడుకోవడానికి అలాగే అట్టిపెట్టారా? అంటూ కమలం పార్టీ నేతలను కేజ్రీవాల్ ప్రశ్నించారు. మరి బీజేపీ నేతలకు మింగుడుపడే అంశాలు కావు ఇవన్నీ. వీటిని కాంగ్రెస్ వాళ్లు ఎలాగూ ప్రస్తావించలేరు. కేజ్రీవాల్ వీటిని బాగానే వాడుతున్నాడు!