ఆ మధ్య కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా ఒకటి విడుదలైతే.. దేశ వ్యాప్తంగా ఆ సినిమా ఫుల్ రన్ లో రెండున్నర కోట్ల రూపాయల వసూళ్లేమో సాధించిందని బాక్సాఫీస్ రిపోర్టులు చెబుతున్నాయి. మరి బాలీవుడ్ లో తన సినిమాలకు అంతా తానవుతూ.. తనకు మించి తన సినిమాకు మరేం అవసరం లేదనంతే స్థాయి బిల్డప్పులున్న కంగనా సినిమా అంత స్థాయిలో డిజాస్టర్ అయ్యే సరికి బాగా వార్తలు వచ్చాయి.
ఈ అంశంపై చివరకు కంగనా స్పందించింది. అది కూడా తనదైన శైలిలో. భారతీయ సినిమా పై పాశ్చాత్య ప్రభావం ఎక్కువైందట, అందుకే తన సినిమా డిజాస్టర్ అయ్యిందన్నట్టుగా కంగనా చెప్పుకోవడం ఆమె స్వోత్కర్షకు పరాకాష్ట! అయితే కంగనాకు ఇలాంటివి కొత్త కాదు. అలా మాట్లాడటం ఆమెకు అలవాటే!
ఆ సంగతలా ఉంటే.. కంగనా ఇక రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టుకోవాలనుకున్నట్టుగా ప్రకటించేసింది. ఆమె భారతీయ జనతా పార్టీ పట్ల ఇప్పటికే చాలా సానుభూతి వ్యక్తం చేసింది. బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలతో ఆమీతుమీ తేల్చుకోవడానికి కూడా వెనుకాడే టైపు కాదు! ఆమె సొంత రాష్ట్రం ఎన్నికలతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి తలదూర్చడానికి బాగా ఉత్సాహంగా ఉంది. ఆమె ప్రకటన పట్ల భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు కూడా సానుకూలంగా స్పందించారట!
ఇక కంగనా సినిమాలు ఈ మధ్యకాలంలో చెప్పుకోదగిన హిట్స్ ఏమీ కావు. మణికర్ణికకు కేంద్రం అవార్డులు అయితే ఇచ్చింది కానీ, జనాల్లోకి ఆ సినిమా చేరువయ్యేంత స్థాయిలో చేరువ కాలేదు. అలాగే కంగనాతో పని చేయడం అంటే దర్శకులకు కూడా తలకు మించిన భారం అనే పేరొచ్చింది. ఈ క్రమంలో కంగనా తన సినిమాలకు తనే రచన, దర్శకత్వం వంటి పనులు కూడా పెట్టుకుంటోంది!
ఇక 2024 ఎన్నికలకు కాస్త ముందు కాంగ్రెస్ ను టార్గెట్ గా చేసుకుని *ఎమర్జెన్సీ* అనే సినిమాను కంగనా చేస్తోంది. ఎమర్జెన్సీ బూచిని బీజేపీ వాళ్లు ఇంకా ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నారు. అరే.. ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ ఉందిరా బాబూ! అని జనాలు అనుకుంటున్నా.. ఇంకా ఇందిర ఎమర్జెన్సీనే బీజేపీ ఆయుధంగా ఉంది. ఇలాంటి క్రమంలో కంగనా లాంటి వాళ్లు ఇలాంటి సినిమా చేయడం పెద్ద వింత కాదు. మొత్తానికి సినిమా కెరీర్ మందగమనంలో పడుతున్న దశలో కంగనా ప్రత్యక్ష రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నట్టుంది.