బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు శపథం చేశారు. విశాఖలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, వైసీపీలపై విరుచుకుపడ్డారు. విశాఖలో భూదొంగలను బయట పెట్టేంత వరకూ తాను నిద్రపోనని ఆయన శపథం చేయడం విశేషం. విశాఖలో భూఆక్రమణలు ఇప్పటి వ్యవహారం కాదు. సుందరమైన విశాఖ నగరంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని పార్టీలకు అతీతంగా భూదోపిడీకి పాల్పడ్డారు.
ఈ వ్యవహారంలో నువ్వు దొంగంటే, కాదు నువ్వే దొంగ అని టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవడం తెలిసిందే. చంద్రబాబు హయాంలో విశాఖలో భూదోపిడీ నిగ్గు తేల్చేందుకు సిట్‌లు వేశారు. వాటి నివేదికలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. పోనీ వైసీపీ వచ్చిన తర్వాతైనా బండారం బయటపెడుతుందని అనుకున్న జనానికి నిరాశే ఎదురైంది. విశాఖను జగన్ ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే హైకోర్టు తీర్పు, ప్రభుత్వం వాటి బిల్లులను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో పరిపాలన రాజధాని వెనక్కి వెళ్లింది. కానీ నేడో, రేపో విశాఖ నుంచే జగన్ పరిపాలన చేస్తారని వైసీపీ నేతలు పదేపదే చెబుతున్నారు. ఆక్రమించిన భూములకు రేట్లు తెచ్చేందుకే ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటూ భ్రమలు కల్పిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జీవీఎల్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ విశాఖలో భూఆక్రమణలపై సిట్‌ల నివేదికలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విశాఖలో భూబాగోతాలపై గవర్నర్‌కు తాను రాసిన లేఖ వల్లే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని చెప్పుకొచ్చారు. విశాఖ భూదందాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ, టీడీపీ పాత్ర వుందని స్పష్టం చేశారు. విశాఖలో భూదందాపై జగన్ ప్రభుత్వం తన వద్ద ఉన్న రెండు సిట్ నివేదికల్ని బయట పెడితే…. ఆ రెండు పార్టీల నేతల భూదందా బాగోతం బయట పడుతుందన్నారు.
విశాఖలో టీడీపీ, వైసీపీ భూదందాను ప్రధాన ఎజెండాగా తీసుకుని తమ పార్టీ పోరాడుతుందన్నారు. భూదందాకు పాల్పడిన నేతల్లో ఏ ఒక్కర్నీ బీజేపీ వదిలిపెట్టదని జీవీఎల్ హెచ్చరించడం గమనార్హం.