కొణదెల ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించి, రెండు సినిమాలు నిర్మించి సక్సెస్ ఫుల్ నిర్మాత అనిపించుకున్నాడు హీరో రామ్ చరణ్. తొలి సినిమాకు అద్భతమైన లాభాలు వచ్చాయి. మలి సినిమా మాత్రం భారీగా నిర్మించడంతో చాలా ఎక్కువ ఖర్చు జరిగింది. ఈ క్రమంలో నిర్మాత రామ్ చరణ్ కు తెలియకుండా కాస్త ఎక్కువ వృధా ఖర్చు జరిగిందనే గుసగుసలు వినిపించాయి. మరోపక్క సినిమా ఆశించిన రేంజ్ కు విజయవంతం కాకఫోవడంతో సంస్థ మీద ఆర్థికభారం పడే అవకాశం వున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్, మలయాళ, తమిళ వెర్షన్లు బాలీవుడ్ దగ్గర ఫెయిల్ అయిన కారణంగా కాస్త భారీగానే వెనక్కు ఇవ్వాల్సి వుంటుందని ట్రేడ్ వర్గాల బోగట్టా. అలాగే కర్ణాటక విషయంలో కూడా జరిగిందని, ఇవన్నీ కలిసి దాదాపు ఇరవై నుంచి పాతిక కోట్ల వరకు వుంటుందని లెక్కలు వినిపిస్తున్నాయి.
దీంతో తన టీమ్ విషయంలో నిర్మాతగా రామ్ చరణ్ కాస్త అసంతృప్తితో వున్నారని, టీమ్ లోని ఓ కీలక సీనియర్ ను తప్పించే ప్రయత్నం చేసారని, కానీ మెగాస్టార్ కలుగచేసుకోవడంతో మళ్లీ ఊరుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆ వ్యక్తికి కొరటాల శివ సినిమా బాధ్యతలు అప్పగించలేదని తెలుస్తోంది.
అలాగే టీమ్ కు చెందిన, ఉన్నతమైన కీలక వ్యక్తికి అప్పగించిన పనులు కూడా కాస్త తగ్గించారని తెలుస్తోంది. ప్రస్తుతం కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ తమ భాగస్వామ్యంలో నిర్మించే చిరు 152వ సినిమా ప్రొడక్షన్ పనుల విషయంలో కేవలం తమ సంస్థ నుంచి ఒక్కరికే బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ వైపు నుంచి వాళ్లు చూసుకుంటారు. కొణిదెల వైపు నుంచి ప్రొడక్షన్ వ్యవహారాలు తక్కువ వుంటాయని బోగట్టా.
సాధారణంగా కొరటాల శివ సినిమా అంటే ఆయనే అన్నీ తానై చూసుకుంటారు. దీనికితోడు ఇప్పుడు రామ్ చరణ్ నిర్మాతగా తీసుకుంటున్న దిద్దుబాటు చర్యల కారణంగా కొణిదెల ప్రొడక్షన్స్ మరింత తక్కువ బాద్యతలు తీసుకుంటుందని తెలుస్తోంది.