పూర్తిగా రోడ్డు రవాణాపై ఆధారపడిన తెలంగాణ రాష్ట్రంలో బస్సు సౌకర్యం అందక ఓ చిన్నారి మరణిస్తే.. దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అంటూ ఘాటుగా ప్రశ్నించిన హైకోర్టు.. మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడింది. హూజూర్ నగర్ కు వంద కోట్ల రూపాయల వరాలు ఇవ్వడానికి నిధులు ఉన్నాయి కానీ, ఆర్టీసీకి చెల్లించడానికి 47 కోట్ల రూపాయుల లేవా అంటూ సీరియస్ గా ప్రశ్నించింది. వరుసగా రెండోరోజు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై వాదనలు విన్న హైకోర్టు.. ప్రభుత్వానికి మరోసారి మొట్టికాయలు వేసింది.
మొదటిరోజు అటు ఆర్టీసీ కార్మికులకు, ఇటు ప్రభుత్వానికి క్లాస్ పీకిన కోర్టు.. రెండోరోజు పూర్తిగా కార్మికులకు మద్దతుగా నిలిచింది. ఆర్టీసీకి తాము ఎలాంటి బకాయిలు లేమంటూ ప్రభుత్వం తెలపడంతో కోర్టు ఆశ్చర్యపోయింది. ఆర్టీసీని ఎందుకు విభజించలేదని, చెల్లింపుల లెక్కలు అందించాలని ఆదేశించింది. అంతేకాదు, విభజన అంశంపై కేంద్రానికి కూడా నోటీసులు జారీచేసింది. రెండోరోజు వాదనల్లో హైకోర్టు తమకు మద్దతుగా నిలవడంతో ఆర్టీసీ కార్మికుల ఉత్సాహం రెట్టింపు అయింది. అదే ఉత్సాహంతో ఈరోజు సకల జనుల సమర భేరీని భారీగా నిర్వహించాలని నిర్ణయించింది.
అయితే సరూర్ నగర్ మైదానంలో భారీగా సభ నిర్వహించాలనుకున్న కార్మికులకు అది సాధ్యంకాలేదు. కేవలం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం మాత్రమే కేటాయించారు. అది కూడా మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభించి, 7 గంటలకు స్టేడియం ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. ఆర్టీసీ సమ్మెపై ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. మరోసారి కలెక్టరేట్లు ముట్టడించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈసారి మెరుపు ముట్టడి లాంటి ప్రయత్నాలకు పోకుండా.. 11వ తేదీన భారీఎత్తున గాంధీ భవన్ నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించింది.
మరోవైపు కార్మిక సంఘాలు వరుసగా 25వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మెలు, రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఎక్కడికక్కడ బస్సుల్ని అడ్డుకున్నారు కార్మికులు. మంగళవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 6441 బస్సులు తిప్పామని ప్రభుత్వం ప్రకటించుకుంది. కార్మిక సంఘాలు మాత్రం వెయ్యికి మంచి బస్సులు తిరగలేదని అంటున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే, కేసీఆర్ సర్కార్ కాకిలెక్కలన్నీ చెబుతోందని.. కోర్టుకు చెప్పిన ఆ లెక్కలన్నీ అబద్ధాలేనని అంటున్నాయి.