Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కౌశల్‌.. ఖర్చు దండగ వ్యవహారం

కౌశల్‌.. ఖర్చు దండగ వ్యవహారం

సోషల్‌ మీడియాలో కౌశల్‌ ఆర్మీ ఓ రేంజ్‌లో హల్‌చల్‌ చేసేస్తోంది. బిగ్‌ బాస్‌ రియాల్టీ షో సీజన్‌ టూ హౌస్‌మేట్స్‌లో కౌశల్‌ మండా ఒకరు. మామూలుగా అయితే, హౌస్‌లోకి ఎంటర్‌ అయిన చాలామంది సెలబ్రిటీలతో పోల్చితే కౌశల్‌కి మొదట్లో వున్న పాపులారిటీ తక్కువే. ఎప్పుడైతే కౌశల్‌ ఆర్మీ హల్‌చల్‌ షురూ అయ్యిందో, అనూహ్యంగా కౌశల్‌ పేరు మార్మోగిపోతోంది. నిజంగానే కౌశల్‌కి ఆ స్థాయిలో అభిమానులున్నారా.? వీరిలో పెయిడ్‌ అభిమానులు ఎంతమంది.? ఈ ప్రశ్నల చుట్టూ జోరుగా చర్చ జరుగుతోందిప్పుడు.

ఈ మధ్యనే ఓ 2కె ర్యాలీ తీసింది కౌశల్‌ ఆర్మీ. ఆ ర్యాలీ సందర్భంగా 'ఖర్చుల కోసం రెండొందలు.. అంతకు మించి నిర్వాహకులు ఇచ్చారు' అంటూ కొందరు చెప్పడం, అదికాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో కౌశల్‌ ఆర్మీపై అనుమానాలు పెరిగిపోయాయి. హౌస్‌లో కౌశల్‌ ఆర్మీని, మిగతా హౌస్‌ మేట్స్‌ ఒంటరిని చేస్తున్న మాట వాస్తవం. దానంతటికీ కారణం కౌశల్‌ ఆర్మీయేనన్న వాదనా లేకపోలేదు. మొదటి నుంచీ కౌశల్‌ని హౌస్‌మేట్స్‌ 'కార్నర్‌' చేస్తున్నా, కౌశల్‌ ఆర్మీ గురించి తెలిశాకే సీన్‌ ఇంకా దారుణంగా తయారైంది.

'కుక్కల్లా మీద పడిపోతారెందుకు.? అంటూ కౌశల్‌ అసహనం చేయడం, అలా కౌశల్‌ అనడానికి ఇతర హౌస్‌ మేట్స్‌ బిహేవియర్‌ కారణమవడం.. ఇదంతా చూస్తోంటే, కౌశల్‌ ఏం కోరుకుంటున్నాడు.? కౌశల్‌ విషయంలో మిగతా హౌస్‌మేట్స్‌ ఆలోచనలేంటి.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలు కలగకమానదు. ఇప్పటిదాకా బిగ్‌హౌస్‌లో జరిగిన గలాటా ఒకఎత్తు.. ఈవారం జరుగుతున్న గలాటా ఇంకోఎత్తు. మరి, ఈ వ్యవహారంపై వీకెండ్‌లో నాని ఎలా స్పందిస్తాడోగానీ, నాని స్పందించడానికైతే బోల్డంత కంటెంట్‌ ఇప్పటికే రెడీ అయిపోయింది.

ఇదిలా వుంటే, మొత్తంగా బిగ్‌ బాస్‌ రియాల్టీ షో సీజన్‌ విజేతగా నిలిచేందుకు కౌశల్‌ తరఫున చాలాఖర్చు చేస్తున్నారన్న ప్రచారమైతే గట్టిగా జరుగుతోంది. కౌశల్‌ ఒక్కడే కాదు, ప్రస్తుతానికి హౌస్‌లో మిగిలిన హౌస్‌మేట్స్‌ అందరి పరిస్థితీ అంతేనట. కొత్తగా 'ఆర్మీలు, సేనలు..' పుట్టుకొస్తుండడం, అభిమాన సంఘాల పేరుతో పలు కార్యక్రమాలు చేపట్టడం.. ఇదంతా 'వేలం వెర్రి' అనే స్థాయికి చేరిపోయింది.

ఇంతకీ, బిగ్‌ బాస్‌ రియాల్టీ షో టైటిల్‌ గెలిస్తే ఏమొస్తుంది.? ప్రైజ్‌ మనీతోపాటు పాపులారిటీ కాస్తో కూస్తో వస్తుంది. అయితే ఆ పాపులారిటీ కారణంగా గత సీజన్‌ విజేత శివబాలాజీ కెరీర్‌లో కొత్తగా వచ్చిన మార్పులు లేవు. అలాచూస్తే, కౌశల్‌ మాత్రమేకాదు, టైటిల్‌ ఎవరు గెలిచినా.. దానికోసం జరుగుతోన్న అనవసర ఖర్చు చూస్తే, ఇదేదో 'ఖర్చు దండగ వ్యవహారం' అన్న భావన కలగకమానదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?