‘నోటా’ కష్టాలు ఇన్నీ అన్నీ కావు

నిర్మాత జ్ఞాన్ వేల్ రాజా పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా వున్నట్లు వుంది.  ఆయనతో వున్న వ్యాపార బంధాల రీత్యా ఎవ్వరూ పెద్దగా పెదవి విప్పడం లేదు కానీ, విజయ్ దేవరకొండ హీరోగా నటించిన నోటా…

నిర్మాత జ్ఞాన్ వేల్ రాజా పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా వున్నట్లు వుంది.  ఆయనతో వున్న వ్యాపార బంధాల రీత్యా ఎవ్వరూ పెద్దగా పెదవి విప్పడం లేదు కానీ, విజయ్ దేవరకొండ హీరోగా నటించిన నోటా సినిమా విడుదలకు ఆయన కాస్త గట్టి ఇబ్బంది పడుతున్నారు.  

ఈ సినిమాను అక్టోబర్ అయిదున విడుదల చేద్దాం అనుకున్నారు నిర్మాత జ్ఞాన్ వేల్ రాజా. అంతా ఓకే అనుకున్నారు. కానీ అంతలో ఆయనకే ఓ అనుమానం వచ్చింది. నోటా విడుదలయిన వారంలో అరవింద సమేత వీర రాఘవ వస్తే, నోటాను థియేటర్లలోంచి తీసేస్తారేమో? అని. కానీ ఆ సమస్య లేదని, ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఆడుతున్న సినిమాలు ఏవీ ఫస్ట్ వీక్ దాకా వుండే చాన్స్ లేదని, కావాల్సినన్ని స్క్రీన్ లు వుంటాయని అందరూ నచ్చ చెప్పారు. 

కాదు, నోటాను 18న విడుదల చేస్తా అంటూ జ్ఞాన్ వేల్ రాజు అడ్డం తిరిగినట్లు బోగట్టా. కానీ దానికి దిల్ రాజు ససే మిరా అన్నారు. జ్ఞాన్ వేల్ రాజా సన్నిహితుడు యువి వంశీ కూడా 18 న అయితే తమ  వైపు నుంచి సహకారం కష్టం అవుతుందని చెప్పేసినట్లు తేలుస్తోంది. దిల్ రాజు కూడా 18న తన సినిమా 'హలో గురూ ప్రేమ కోసమే' వుందని, అప్పుడు వేయడానికి వీలులేదని అడ్డం పడ్డారు. 

పైగా తమిళంలో కూడా నోటా విడుదలకు 18 పెద్ద అనుకూలమైన డేట్ కాదని తెలుస్తోంది. అప్పుడు అక్కడ చాలా సినిమాలు వున్నాయి. అందువల్ల ఈ సినిమాకు మహా అయితే వందా, రెండువందల స్క్రీన్ లు దొరకడం కష్టం. విజయ్ దేవరకొండను తమిళంలో లాంచ్ చేస్తూ, వందా రెండు వందల స్క్రీన్లలో వేయడం అంటే సరికాదని, జ్ఞాన్ వేల్ కు సన్నిహితులు నచ్చ చెప్పే ప్రయత్నం చేసారు.అదే సమయంలో కర్ణాటకలో కూడా పెద్ద సినిమాలు ఒకటి రెండు వున్నాయి. 

దాంతో అయిదుకే వస్తానని జ్ఞాన్ వేల్ టాలీవుడ్ లోని తన సన్నిహితులకు మెసేజ్ లు పెట్టారు. కానీ ఇప్పుడు మళ్లీ కథ మొదటికి వచ్చింది. ముందుగా పబ్లిసిటీ సరిగ్గా ప్లాన్ చేయలేదు. వారం పది రోజులు పబ్లిసిటీకి సరిపోతుందా అని డౌట్. ఇలాంటి టైమ్ లో విజయ్ దేవరకొండ తల్లికి ఆరోగ్యం సరిగ్గాలేదు. దాంతో విజయ్ తల్లి దగ్గర వుంటున్నారు. ప్రచారానికి, సినిమా విడుదల వ్యవహారాలకు టైమ్ కేటాయించే పరిస్థితి కనిపించడం లేదు.

ఇప్పుడు అయిదుకు రాలేక, 18 వీలుకాక, నోటా పరిస్థితి ఎటూ కాకుండా అయిపోతోంది. అసలే ఆ సినిమాకు బజ్, టాక్ కూడా అంతంత మాత్రంగా వుంది. మొత్తం మీద చూస్తుంటే జ్ఞాన వేల్ రాజా టైమ్ అంత బాగున్నట్లు లేదు. దీంతో నోటా సినిమా నవంబర్ కు వెళ్లిపోతుదంటూ గ్యాసిప్ లు వినిపించడం ప్రారంభమైపోయింది. మరి ఇది నవంబర్ కు వెళ్తే టాక్సీవాలా పరిస్థితి ఏమిటో?