బాలయ్య స్టయిల్ నే వేరు. ఒకసారి నమ్మితే, నమ్మి బాధ్యతలు అప్పగిస్తే, ఇక మారు మాట్లాడరు. ఎలాచెబితే అలా ముందుకు వెళ్లిపోతారు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో కూడా అదే జరుగుతోంది అని వినికిడి. మహానటి సినిమా చూసిన తరువాత బాలయ్య ఫిక్స్ అయిపోయారు. తను నిర్మించే ఎన్టీఆర్ బయోపిక్ కూడా నభూతో నభవిష్యత్ అనేటట్లు వుండాలని. అందుకే ఆయనే ఏరికోరి క్రిష్ ను తెచ్చుకున్నారు.
ఇప్పుడు క్రిష్ కు పూర్తి బాధ్యతలతో పాటు హక్కులు కూడా ఇచ్చేసారని తెలుస్తోంది. నటీనటుల ఎంపిక, స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు, టెక్నీషియన్ల మార్పులు ఇలా అన్నీ క్రిష్ దే ఫైనల్ డెసిషన్. ఇప్పటికే కీలకమైన సినిమాటోగ్రాఫర్ ను మార్చేసి, తన రెగ్యులర్ పర్సన్ అయిన జ్ఞానశేఖర్ ను తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా సినిమా బడ్జెట్ విషయంలో కూడా పరిమితులు ఏమీ పెట్టడంలేదని తెలుస్తోంది.
బాలయ్య ఒకటే చెప్పారు క్రిష్ కు అని టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ ఓ అద్భుతమైన చిత్రంగా మిగిలినపోవాలి అన్నదే బాలయ్య కోరికగా తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ ఈ నెలాఖరు లేదా వచ్చేనెలలో ప్రారంభమై, నిర్విరామంగా షూట్ జరుగుతుంది. గతంలో సంక్రాంతి విడుదల అన్నది బాలయ్య కోరిక.
మరి ఆ దిశగానే వెళ్తుందా? సమ్మర్ టార్గెట్ గా రెడీ అవుతుందా? అన్నది చూడాలి. ఎన్నికలకు ముందుగానే సినిమాలు విడుదల చేయాలన్నది బాలయ్య ఆలోచనగా వుంది. కానీ ఎన్నికలు డిసెంబర్, జనవరి అని, కాదు, మార్చి అని రకరకాలుగా వినిపిస్తోంది.