స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితంలోని 'వెన్నుపోటు' ఎపిసోడ్‌ని ప్రధానాంశంగా చేసుకుని, రామ్‌గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం విదితమే. 'త్వరలో, మీ అభిమాన థియేటర్లలో..' అంటూ ఈ సినిమాకి సంబంధించిన తాజా సాంగ్‌ని వర్మ విడుదల చేశారు. నిజానికి ఇది ఓ పాట కాదు. కొన్ని ప్రశ్నలతో కూడుకున్న వీడియో.
ఎందుకు.? ఎందుకు.? అంటూ కొన్ని ప్రశ్నల్ని వర్మ, ఈ వీడియో ద్వారా సంధించాడు. కూతుళ్ళు, కొడుకులు వుండగా, పరువు పోతుందని తెలిసీ, లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ ఎందుకు పెళ్ళాడాల్సి వచ్చింది.? అన్న ప్రశ్న చుట్టూ కొంత అభ్యంతరం వ్యక్తమవుతోందనుకోండి.. అది వేరే విషయం. స్వర్గీయ ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిని ఎందుకు పెళ్ళాడారో అందరికీ తెలుసు.
కొత్తగా వర్మ చూపించడానికేమీ లేదు. అయితే, చరిత్రని జనం మర్చిపోయేలా చేయడంలో చంద్రబాబు సఫలమయ్యారు.. స్వర్గీయ ఎన్టీఆర్ ఆవేదన ప్రజలకు చేరినా, దాన్ని తనదైన రాజకీయ వ్యూహంతో ఎప్పటికప్పుడు మరుగున పరిచేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తూనే వున్నారు.
సాక్షాత్తూ నందమూరి తారకరామారావు మీడియా ముందుకొచ్చి, చంద్రబాబు గురించి చెప్పినా, జనం ఆ తర్వాత చంద్రబాబుకే పట్టంకట్టారు. ఎన్టీఆర్ ఆవేదనకు సంబంధించి ఇప్పటికీ కొన్ని వీడియోలు అందుబాటులో వున్నాయి. మరి, వర్మ చూపించబోయే కొత్త నిజం ఏంటి.? వర్మ మాటల్లో అయితే 'నగ్న'సత్యం చూపించబోతున్నాడట.
నిజమేనా.? నమ్మగలమా.? 'రక్తచరిత్ర' సినిమాకి ముందు వర్మ మాట్లాడిన మాటలేంటి.? అందులో వర్మ చూపించినదేంటి.? 'వంగవీటి' సినిమా విషయంలోనూ వర్మ పబ్లిసిటీ స్టంట్స్‌నే నమ్ముకున్నాడు. ఇప్పుడు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విషయంలో వర్మ, అందుకు భిన్నంగా వ్యవహరిస్తారని అనుకోలేం.
నిజాన్ని అబద్ధంగా మార్చేశారనీ, అబద్ధానికి నిజం అనేపొరలు కప్పేశారనీ.. అవన్నీ విప్పేసి నిజాన్ని 'నగ్నంగా' చూపిస్తాననీ వర్మ తాజా వీడియోలో ప్రకటించేశాడు. నిజమేనా.? స్వర్గీయ ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి 'దాగి వున్న నిజం' అన్న ప్రస్తావనకే అవకాశం లేదు. మరి, వర్మ ఏం చూపించబోతున్నాడో అంత నగ్నంగా.!