‘మెగా’ అభిమానులకి వేరే శతృవు ఎందుకు.?

చిరంజీవి – బాలకృష్ణ స్నేహితులట. అవును, పలు సందర్భాల్లో ఇటు చిరంజీవి, అటు బాలకృష్ణ ఈ విషయాన్ని కుండబద్దలుగొట్టేశారు. సినిమాల పరంగా పోటీనే తప్ప, వ్యక్తిగతంగా తమ మధ్య ఎలాంటి విభేదాల్లేవని ఇద్దరూ చెప్పారు.…

చిరంజీవి – బాలకృష్ణ స్నేహితులట. అవును, పలు సందర్భాల్లో ఇటు చిరంజీవి, అటు బాలకృష్ణ ఈ విషయాన్ని కుండబద్దలుగొట్టేశారు. సినిమాల పరంగా పోటీనే తప్ప, వ్యక్తిగతంగా తమ మధ్య ఎలాంటి విభేదాల్లేవని ఇద్దరూ చెప్పారు. పెళ్ళిళ్ళు వంటి కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసి సందడి చేసిన దాఖలాలూ వున్నాయి. అయితే, బాలకృష్ణ వీలు చిక్కినప్పుడల్లా చిరంజీవిపైనా, మెగా కాంపౌండ్‌పైనా సెటైర్లు వేస్తుంటాడు. ఇది అందరికీ తెల్సిన విషయమే. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బాలయ్యకు కొత్తేమీ కాదు. 

అన్నీ తెలిసీ, 2014 ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌, తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చారు. ఆ సమయంలో, బాలయ్యకి పవన్‌కళ్యాణ్‌ 'పవర్‌ఫుల్‌'గానే కన్పించారనుకోండి.. అది వేరే విషయం. ఆ తర్వాతే, బాలయ్య సహా టీడీపీ నేతల్లో చాలామందికి 'పవన్‌' ఎవరో తెలియకుండా పోయింది. బాలయ్య మాత్రమే కాదు, మాజీ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు కూడా ఓ సందర్భంలో 'పవన్‌ ఎవరో తెలియదు' అంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చారు. 

పాపం నాగబాబుకి కాస్త లేటుగా జ్ఞానోదయం అయినట్టుంది.. తమ్ముడిపైనా, అన్నయ్యపైనా.. తనకున్న ప్రేమని చాటుకునేందుకు బాలయ్య గతంలో మెగా కాంపౌండ్‌పై చేసిన కామెంట్లను గుర్తుకు తెచ్చుకుని మరీ, సోషల్‌ మీడియాలో ఫైట్‌ షురూ చేశారు. దాంతో, మెగా ఫ్యాన్స్‌ కొంతవరకు నాగబాబుని సపోర్ట్‌ చేస్తున్నారు. కానీ, మెగా అభిమానుల్లోనే కొందరు నాగబాబు తీరుని లైట్‌ తీసుకుంటుండడం గమనార్హం. 

నిజమే మరి, మెగా అభిమానుల్లో చీలిక ఎప్పుడో వచ్చేసింది. అలా చీలిక రావడానికి కారణం కూడా మెగా కాంపౌండే. 'చెప్పను బ్రదర్‌' అంటూ అల్లు అర్జున్‌, 'మా తమ్ముడ్ని మేం పిలిస్తే రావడంలేదు, చేతనైతే మీరే పిల్చుకోండి' అని నాగబాబు.. అసహనంతో ఊగిపోతూ, అభిమానుల్లో 'చీలిక' తీసుకొచ్చారు. పవన్‌ అభిమానులు తక్కువేం తిన్లేదు, తాము మెగా కాంపౌండ్‌కి వ్యతిరేకం అన్నట్టు వ్యవహరించారు. 

సినీ అభిమానులే అటు చిరంజీవికిగానీ, ఇటు పవన్‌కళ్యాణ్‌కిగానీ.. వారు స్థాపించిన పార్టీల్లో కార్యకర్తలుగా మారాల్సి వచ్చిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. చంద్రబాబుని 2009 ఎన్నికల సమయంలో మెగా ఫ్యాన్స్‌ (పవన్‌ అభిమానులతో కలుపుకుని) తిట్టారు, 2019 ఎన్నికల్లో ఇదే మెగా ఫ్యాన్స్‌ చంద్రబాబుని భుజాన మోశారు, పవన్‌ చెప్పడంతో. మళ్ళీ ఇప్పుడు జనసేన కోసం, అదే చంద్రబాబునీ.. బాలయ్యనీ విమర్శించడానికి వెనుకాడ్డంలేదు మెగా అభిమానులు. 

రాజకీయాల్లో ఇంత కన్‌ఫ్యూజన్‌తో కొట్టుమిట్టాడుతూ, జనాన్ని ఉద్ధరించేస్తామని చెబితే ఎలా.? బాలయ్య ఎపిసోడ్‌లో మెగా అభిమానుల్లో కొందరికి వాయిస్‌ లేకుండా పోయిందంటే దానిక్కారణం మెగా హీరోలే. తమ అభిమాన హీరోలు ఎప్పుడెలా వ్యవహరిస్తారో అభిమానులకే అర్థం కాని పరిస్థితి. 'మెగా అభిమానులకి వేరే శతృవులు అక్కర్లేదు, ఆ పాత్ర కూడా మెగా హీరోలే పోషించేస్తుంటారు..' అని కొందరు మెగా అభిమానులు సోషల్‌ మీడియాలో వాపోతున్న వైనం.. పాపం నాగబాబు దృష్టికి రాకుండా వుంటుందా.?