ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం బుధవారం విడుదల కాబోతోంది. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి.. ప్రేక్షకలోకం యావత్తూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఇది. ప్రపంచమంతా కూడా తెలుగువాళ్లు ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ జీవితం అంటే.. అది దాదాపుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ఒక శకాన్ని క్లుప్తంగా పరిచయం చేయడమే అవుతుంది. ఇవన్నీ ఒకఎత్తు అయితే.. ఈ చిత్రానికి సంబంధించి.. పలువురు తొక్కిపడుతున్న వివాదం ఇప్పుడు తారస్థాయికి చేరుకుంటోంది. సినిమా విడుదల వేళ… టాలీవుడ్ లో గుసగుసలుగా చర్చకు వస్తోంది.
వివరాల్లోకి వస్తే… విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి..
ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి.. ఏడాదిన్నర కిందట బయోపిక్ చేయబోతున్నట్లు బాలకృష్ణ ప్రకటించారు. అప్పటినుంచే కథకు సంబంధించిన కసరత్తు ప్రారంభం అయింది. ఎన్టీఆర్ తో ప్రత్యక్షంగా అనుబంధం ఉన్న ఎందరో పెద్దలు, సీనియర్ అధికార్లు, సినీ పరిశ్రమకు చెందినవాళ్లు అందరితోనూ కలసి వివరాలు సేకరించారు. ఎన్టీఆర్ జీవితం గురించి వచ్చిన పుస్తకాలను వడపోసి.. జీవితకథకు సెల్యులాయిడ్ అనుగుణమైన రూపం ఇచ్చారు.
ఈ మొత్తం కసరత్తులో… కొందరు కీలకంగా పాల్గొనగా.. వారిలో శ్రీనాధ్ అనే రచయిత- దర్శకుడు కూడా ప్రధాన భూమిక పోషించాడు. ఎల్.శ్రీనాధ్ అనే వ్యక్తి.. కేవలం రచయిత మాత్రమేకాదు.. గతంలో శ్రీహరి హీరోగా కుబుసం అనే చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ప్రాథమికంగా, అప్పట్లో బాలకృష్ణ ఆమోదించిన సినిమా కథ మొత్తం శ్రీనాధ్ ఆధ్వర్యంలో తయారైంది. దానికి అప్పటి దర్శకుడు తేజ ఆమోదం కూడా పూర్తయింది. అచ్చంగా శ్రీనాధ్ తయారుచేసిన కథతోనే నిర్మాణం ప్రారంభించారు. ఆ తర్వాత.. రకరకాల కారణాల నేపథ్యంలో తేజ బయటకు వెళ్లగొట్టబడడం, క్రిష్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.
అసలే ప్రాజెక్టులోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలాగా ప్రవేశించిన క్రిష్… తన ముద్ర చూపించుకోడానికి… ఎడాపెడా మార్పుచేర్పులు చేసేశాడు. అయినా ఇక్కడ విషయం ఏంటంటే… తీస్తున్నది ఎన్టీఆర్ జీవిత చరిత్ర.. కథను మార్చడానికి ఏముంటుంది? ఆ రకంగా తాను చేయగలిగేది కథలో ఏమీ ఉండదు గనుక… ఆయన కథనంలో తనముద్ర చూపించుకోడానికి.. కొంత ప్రయత్నం చేశారు.
ఇక కథ సమకూర్చిన శ్రీనాధ్ విషయానికి వస్తే.. ఆయనకు గతంలోనే కొంత పారితోషికం చెల్లించారు. తర్వాత కనీసం షూటింగ్ కు కూడా పిలవకుండా.. దూరంపెట్టారు. ఆరాతీస్తే.. అసలు టైటిల్స్ లో కూడా ఆయన పేరు ఉంచడం లేదని తెలిసింది. దీంతో శ్రీనాధ్, రాద్ధాంతం ప్రారంభించాడు.
శ్రీనాధ్ అంటే.. ఏదో అవకాశాల కోసం దేవులాడుతూ ఉండే ఒక చిత్ర దర్శకుడి లాగా.. ఆమాంబాపతు వ్యవహారం కాదు. తెలంగాణ నేపథ్యం, ఉద్యమం, పోరాటాలకు సంబంధించి.. ఆయనకంటూ ఒక బ్యాక్ గ్రౌండ్ ఉంది. గతంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా కూడా చరిత్ర ఉంది. దీంతో ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకోకుండా.. శ్రీనాధ్.. దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేశాడు.
సినీ రూపకల్పనలో కొత్తగా చేరిన వాళ్లంతా కలిసి.. ఒక బృందంగా ఏర్పడి తెలంగాణకు చెందిన శ్రీనాధ్ కు అన్యాయం చేస్తున్నారంటూ.. టాలీవుడ్ లో రెండు వర్గాలుగా దీన్ని గురించి చర్చించుకోవడం మొదలైంది. తెలంగాణ ప్రతిభను తొక్కేసే ఇలాంటి ప్రయత్నాలను కొనసాగనివ్వరాదంటూ పలువురు ఆగ్రహించినట్లు కూడా సమాచారం. ఆ సంగతి బయటకు పొక్కిన తర్వాత రాజీ ప్రయత్నాలు మొదలయ్యాయి.
అసలు, తానుతీస్తున్న కథకు, శ్రీనాధ్ చేసిన కథతో సంబంధమే లేదు పొమ్మని క్రిష్ తేల్చేశాడు. పంచాయతీ జరిగింది. ఇవి శ్రీనాధ్ కథతో సంబంధం లేని సీన్లు అంటూ.. క్రిష్ వాదించినవన్నీ.. శ్రీనాధ్ తన వద్ద ఉన్న స్క్రిప్టు కాపీలోనే చూపించగలిగాడు. దీంతో క్రిష్ వాదన నిలవలేకుండా పోయింది. ‘రచనా సహకారం’ కింద.. శ్రీనాధ్ పేరు వేయడానికి ఒప్పందం కుదిరింది. అందుకు కూడా ఒప్పుకోకుండా.. ఆయన తొలుత పట్టుబట్టినప్పటికీ.. తర్వాత.. పలువురి సలహా మేరకు మిన్నకుండిపోయాడు.
ఈలోగా.. శ్రీనాధ్ కు తొలుత హామీ ఇచ్చిన మేరకు రెమ్యునరేషన్ ఇవ్వకుండా పెండింగ్ లో ఉంచిన మొత్తాన్ని నిలిపివేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయినా సరే… వివాదం గురించి తెలిసి, నేషనల్ మీడియా తనను సంప్రదించినప్పుడు శ్రీనాధ్ మాత్రం.. హుందాగా వివాదాన్ని కెలక్కుండా ఉండిపోయారు. అయితే ఆయన విషయంలో ఈ సినిమాకు సంబంధించిన ముఖ్యులు కొందరు.. అన్యాపదేశంగా హెచ్చరికలు చేసినట్లుగా కూడా ప్రచారం ఉంది.
‘విలువలతో కూడిన మహనీయుడి కథ’ అని చెప్పుకుంటూ ఇంత భారీ చిత్రం రూపొందిస్తూ.. వందల కోట్ల రూపాయలకు మార్కెట్ చేసుకుంటూ… ఇలా కథ రూపకల్పనలో కీలకంగా ఉన్న వారికి డబ్బులు ఎగవేయడం ఏమిటో కూడా ఇండస్ట్రీలో పలువురికి అర్థంకాని సంగతి.
ఇప్పటికీ ఈ వివాదం.. నివురుగప్పిన నిప్పులాగా రగులుతూనే ఉంది. నిజానికి కథ అనే డిపార్ట్ మెంట్ కింద ఉండగల పేర్లలో శ్రీనాధ్ పేరు కూడా ఉంచినంత మాత్రాన.. క్రిష్ కు పోయేదేమీ లేదు. కానీ.. అనవసరమైన ఈగోలకు వెళ్లి.. ఆయన పేరు మాత్రం తొలగించి.. దానిని ‘సహకారం’ అనే టైటిల్ కార్డు కిందకు మార్చడం వల్లనే ఈ వివాదం మొత్తం రేగుతున్నట్లుగా తెలుస్తోంది.
మరి కనీసం విడుదల తర్వాతనైనా.. ఈ వివాదం మరింత ముదిరి ‘కథానాయకుడు’ రోడ్డున పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారో లేదో చూడాలి.