రామ్‌గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాని 2019 జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని గతంలో ప్రకటించారు. కానీ, ఇప్పుడది కాస్త ఆలస్యమయ్యేలా కన్పిస్తోంది. జనవరి నుంచి సినిమాని ఫిబ్రవరికి నెట్టేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దిశగా రామ్‌గోపాల్ వర్మ సంకేతాలు కూడా పంపుతున్నాడు. నిజానికి, ఎప్పుడో ప్రారంభమయి.. పూర్తయిపోవాల్సిన సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. మధ్యలో 'ఆఫీసర్' సినిమాని వర్మ రూపొందించి, ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి.. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సంగతి తెల్సిందే.
తన సినిమాల్ని పక్కన పెట్టి, తన శిష్యుల సినిమాల్ని ప్రమోట్ చేయడంలో బిజీగా వున్న రామ్‌గోపాల్ వర్మ, 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడన్న వాదనలు విన్పిస్తున్నాయి. అయితే, వర్మ ఒక్కసారి రంగంలోకి దిగితే.. బిజీ బిజీగా షూటింగ్ పూర్తిచేసేసి, 'మమ' అన్పించేయగలడు.
సినిమా ఔట్‌పుట్‌తో ఆయనకు సంబంధం వుండదు. 'ప్రతి సినిమా విజయవంతమవ్వాలనే అనుకుంటాం.. ఒక్కోసారి తేడా కొట్టేస్తుంటాయి..' అనేసి ఫెయిల్యూర్‌ని లైట్ తీసుకోవడం వర్మకి అలవాటే. లేకపోతే 'ఆఫీసర్' సినిమాకి వర్మ ఎంత జాగ్రత్తగా వ్యవహరించి వుండాలి.?
'శివ' తర్వాత అంతటి సినిమా.. అన్నట్లుగా 'ఆఫీసర్' రిలీజ్‌కి ముందు వర్మ హడావిడి చేశాడు. సో, వర్మ నుంచి 'పెర్‌ఫెక్ట్ ఔట్‌పుట్' వస్తుందని ఆయన అభిమానులు సైతం ఇప్పుడు ఆశించే పరిస్థితి లేదన్నమాట. అందుకే, 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపైనా పెద్దగా అంచనాల్లేవు.
ఏదో ఒక జిమ్మిక్కు చేసి, హైప్ క్రియేట్ చెయ్యడం వర్మకి అలవాటేగానీ, ఆ జిమ్మిక్కులు కూడా ఈ మధ్య అస్సలేమాత్రం పనిచేయడంలేదు. వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై ఎన్నో ఆశలు పెట్టుకున్న లక్ష్మీ పార్వతికి కూడా ఇప్పుడు ఈ సినిమాపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఆమెకు స్క్రిప్ట్ చూపించే ప్రసక్తే లేదని వర్మ చెబుతున్నాడు మరి. సినిమాలో ఏముంటుందన్నది వేరే ప్రశ్న.. అసలంటూ, ఈ సినిమా 2019 ఎన్నికల కంటే ముందు వస్తుందా.? ఏమో, వర్మకే తెలియాలి.
కల్యాణ్ రామ్ ఇంతకీ ఎటువైపు..? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్