ఒకసారి ఫెయిల్యూర్ వస్తే, విజయం ఎంతకష్టమో తెలుస్తుంది. ఒకసారి విజయం వచ్చిన తరువాత జాగ్రత్తలు మరీ పెరిగిపోతాయి. టాలీవుడ్ టాప్ హీరోలు అందరికీ ఇదే సమస్య. ఫెయిల్యూర్ చూసిన బన్నీ సరైన హిట్ కోసం చిరకాలంగా కిందామీదా అవుతున్నారు. ఏ స్క్రిప్ట్ కూడా ఓ పట్టాన నచ్చడంలేదు. నమ్మకం కుదరడం లేదు.
సరే బన్నీ సంగతి అలా వుంచితే సూపర్ స్టార్ మహేష్ దీ అదే సమస్య. వరుసగా ఫ్లాపులు, హిట్ లు కూడా పలకరించాయి మహేష్ ను. భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ అనిపించుకున్నా, చాలా ఏరియాలు బ్రేక్ ఈవెన్ కానివి కూడా వున్నాయి. ప్రస్తుతం చేస్తున్న మహర్షి సంగతి అలా వుంచితే, చేయబోయే సుకుమార్ సినిమా మీద టెన్షన్ పడుతున్నాడు మహేష్ బాబు.
సుకుమార్ గతంలో మహేష్ కు మరుపురాని డిజాస్టర్ తీసిఇచ్చాడు. అందుకే ఇప్పుడు మహేష్ జాగ్రత్త పడుతున్నాడు. సుకుమార్ చెప్పిన స్క్రిప్ట్ మహేష్ కు నచ్చడం లేదని తెలుస్తోంది. ఎన్ని కరెక్షన్లు చేస్తున్నా, స్క్రిప్ట్ లాక్ కావడం లేదు.
పోనీ ఈ సినిమాను పక్కన పెట్టి అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ రెడ్డి సినిమా మీదకు వెళ్లిపోదామా అనుకుంటే, అతగాడు కూడా ఫస్ట్ హాఫ్ మాత్రం నెరేషన్ ఇచ్చి ఊరుకున్నాడు. సెకండాఫ్ కు ఇదిగో అదిగో అంటున్నాడని తెలుస్తోంది.
ఇప్పుడు సుకుమార్ ఏమాత్రం స్పీడప్ అవ్వకపోయినా, మహేష్ కు నచ్చినట్లు స్క్రిప్ట్ తయారు చేయకపోయినా, ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యే ప్రమాదం కనిపిస్తోందని కూడా తెలుస్తోంది. ప్రస్తుతానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ఇద్దరు డైరక్టర్లకే. వీళ్ళు కథలు రెడీ చేయకపోతే, పరిస్థితి ఏమిటో?
కల్యాణ్ రామ్ ఇంతకీ ఎటువైపు..? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్