మొత్తానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చాలావరకు విజయం సాధించింది. సెన్సారు కష్టాలు దాటింది. ఎన్నికల కమిషన్ ను సమస్యను అధిగమించింది. నైజాంలో విడదలవుతోంది. ఓ కమర్షియల్ సినిమాకు వచ్చే ఓపెనింగ్స్ ఈ సినిమాకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే చాలా షోలు ఫుల్ అయిపోయాయి. మల్టీ ఫ్లెక్స్ ల్లో టికెట్ ల కోసం వెదుకులాట కనిపిస్తోంది.
అయితే సినిమా ఆంధ్రలో విడుదల కావడంలేదు. కోర్టు ఆంక్షల కారణంగా సినిమాను విడుదల చేయడంలేదు. కానీ అంతమాత్రం చేత సినిమా ఆగిపోతుందని అనుకోవడానికి లేదు. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ మీద ఆర్జీవీ అండ్ కో లీగల్ పోరాటం చేసే అవకాశం వుంది. అది ఎలా టర్న్ తీసుకుంటుంది అన్న దాన్ని బట్టి సినిమా ఆంధ్రలో విడుదల ఆధారపడి వుంటుంది.
అయితే డిజిటల్ టెక్నాలజీ రోజుల ఇవి. సినిమా ఒకచోట పడితే చాలు జనాలకు చేరిపోవడానికి. మామూలుగానే పెద్దసినిమాలను ఇలా విడుదలయితే అలా ఫేస్ బుక్ లైవ్ లు పెట్టేస్తున్నారు. క్లిప్పింగ్ లు వాట్సప్ ల్లోకి వచ్చేస్తున్నాయి. అందువల్ల సినిమా కంటెంట్ అయితే ఆంధ్రలో కూడా రివీల్ అయిపోవడం అన్నది జరిగిపోవచ్చు.
ఎప్పుడయితే సినిమా విడుదల ఆంధ్రలో లేదు అని తెలిసిందో, పైరసీ సీడీలు హాట్ కేక్ లు అయిపోయే అవకాశం వుంది. పైగా ఓవర్ సీస్ లో సినిమా విడుదలవుతోంది. అందువల్ల నెట్ లో పైరసీ ప్రింట్ లకు లోటు వుండదు. ఎటొచ్చీ ఒకటే సమస్య. ఆంధ్రలో సినిమా మీద వస్తుందనుకున్న రెవెన్యూ మాత్రం రాకపోవచ్చు.