అటుఇటుగా రెండేళ్ల కిందటిమాట.. నితిన్ తో అ.ఆ సినిమా ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఆ సినిమాలో మ్యూజిక్ డైరక్టర్ గా అనిరుధ్ ను తీసుకోవాలనేది త్రివిక్రమ్ ఆలోచన. కానీ అదే టైమ్ లో కోలీవుడ్ లో అనిరుధ్ కంపోజ్ చేసిన బీప్ సాంగ్ వివాదాస్పదమైంది. దీంతో తన సినిమాకు కూడా వివాదాలు చుట్టుముడతాయనే భయంలో అనిరుధ్ ను తప్పించాడు త్రివిక్రమ్.
సరిగ్గా ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితే త్రివిక్రమ్ కు ఎదురైంది. ఈసారి అల్లుఅర్జున్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఇందులో ఓ కీలకపాత్ర కోసం నానా పటేకర్ ను తీసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ నానా పటేకర్ ఇప్పుడు సినిమాలు తగ్గించేశాడు. అతడు సినిమాలు తగ్గించాడని అనడం కంటే, హిందీలో అతడ్ని ఎవరూ తీసుకోవడం లేదనడం కరెక్ట్.
అవును.. తనుశ్రీ దత్తా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన తర్వాత నానా పటేకర్ కు అవకాశాలు తగ్గిపోయాయి. హౌజ్ ఫుల్ సిరీస్ నుంచి అతడ్ని తప్పించి ఆ స్థానాన్ని రానాతో భర్తీ చేసిన విషయం తెలిసిందే. అలాంటి నటుడ్ని టాలీవుడ్ కు తీసుకొచ్చి బన్నీ సినిమాలో ఛాన్స్ ఇస్తున్నాడట త్రివిక్రమ్.
ప్రస్తుతానికైతే యూనిట్ లో నానాను తీసుకోవాలా వద్దా అనే విషయంపై గట్టిగా చర్చ సాగుతోంది. తీసుకున్న తర్వాత మరోసారి వివాదాలు రేగితే మొత్తం సినిమానే డైలమాలో పడుతుందని భయపడుతున్నారు. మరి నానా పటేకర్ ను త్రివిక్రమ్ తీసుకుంటాడా లేక మరోసారి పక్కనపెడతాడా అనేది చూడాలి.
మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఇంకా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పూర్తికాలేదని ప్రకటించారు హారిక-హాసిని నిర్మాతలు. అది పూర్తయిన తర్వాత సినిమా సెట్స్ పైకొచ్చే తేదీని ప్రకటిస్తామన్నారు. నా పేరు సూర్య ఫ్లాప్ తర్వాత హీరో అల్లుఅర్జున్ చేస్తున్న సినిమా ఇదే. ఆ సినిమా వచ్చి దాదాపు 10 నెలలు అవుతోంది.