cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌

సినిమా రివ్యూ: లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌

రివ్యూ: లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: ఎన్‌ హెచ్‌ స్టూడియోస్‌, ఆర్జీవీ గన్‌షాట్‌ ప్రొడక్షన్స్‌
తారాగణం: విజయ్‌కుమార్‌, యజ్ఞాశెట్టి, శ్రీతేజ్‌ తదితరులు
సంగీతం: కళ్యాణి మాలిక్‌
రచన: రామ్‌ గోపాల్‌ వర్మ, నరేంద్ర
ఛాయాగ్రహణం: రామి
నిర్మాతలు: దీప్తి బాలగిరి, రాకేష్‌ రెడ్డి
దర్శకత్వం: రామ్‌ గోపాల్‌ వర్మ, అగస్త్య మంజు
విడుదల తేదీ: మార్చి 29, 2019

'అసలు కథ' అంటూ రామ్‌ గోపాల్‌ వర్మ హైప్‌ చేస్తూ వచ్చిన స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవితంలోని చివరి ఘట్టం... నిజంగా అసలు కథనే చెప్పిందా? నిజాలని మాత్రమే తెరకెక్కించిందా? ఇది నిజమని వర్మ బల్ల గుద్ది చెప్పవచ్చు. ఇదే వాస్తవమని ఈ కథ ఎవరికైతే రుచిస్తుందో వారు నమ్మబలకవచ్చు. కానీ ఇది నిజం కాదని డిబేట్‌ చేయడానికి కావాల్సినంత మెటీరియల్‌ వుంది. అదంతా బూటకమని, ఇదే నిజమని నమ్మించడానికి ఇందులో బలంగా ప్రయత్నించారు. టైటిల్‌లోనే చెప్పినట్టు ఇది 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'. లక్ష్మీపార్వతి కోణంలో చెప్పిన కథ. 'ఎవరి కథకి వాళ్లే హీరో' అన్నట్టుగా ఈ కథకి లక్ష్మీపార్వతి వేలెత్తి చూపించలేనంత గొప్ప లక్షణాలున్న స్త్రీమూర్తి. ఎన్టీఆర్‌ ఆరాధనలో జీవించి, ఆయనకి చివరి రోజుల్లో సాంత్వన చేకూర్చి, కుటిల రాజకీయ కుతంత్రంలో అన్నీ కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయింది!

ఇదే నిజమని నమ్ముతామనే వాళ్లకి, ముఖ్యంగా చంద్రబాబు వ్యతిరేకులకి, టీడీపీ వైరి వర్గానికి ఇది ఒక విధమైన శాడిస్టిక్‌ ప్లెజర్‌ ఇస్తుంది. అయితే ప్రతి కథకీ రెండు కోణాలుంటాయనే వారు రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కించిన ఈ వన్‌ సైడ్‌ 'ప్రేమకథ'ని అంత ఈజీగా నమ్మలేరు. ఎన్నికల సీజన్‌లో వచ్చే ప్రాపగాండా సినిమాల్లానే ఇది కూడా అనేస్తారు. ఎందుకంటే చంద్రబాబునాయుడుపై ఎలాగైతే 'వెన్నుపోటు' ఆరోపణలున్నాయో, పార్టీపై ఆడ పెత్తనం అంటూ లక్ష్మీపార్వతిపై కూడా అన్ని ఎలిగేషన్స్‌ వున్నాయి. అయితే వర్మ ఎందుకో లక్ష్మీ పక్షం వహించాడు. భర్తతో కలిసి వుంటోన్న ఒక వివాహితని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నుంచి ఆమెకి తన పార్టీ ప్రచార వ్యవహారాలతో సహా అన్నిట్లో ప్రాధాన్యత ఇవ్వాలనేది ఎన్టీఆర్‌ వైపునుంచి వచ్చినదే తప్ప లక్ష్మీపార్వతి అడిగి తీసుకున్నది కాదని అనిపించేట్టుగా నమ్మించేందుకు చూసాడు.

సాధారణంగా పవర్‌ఫుల్‌ పీపుల్‌కి అభిముఖంగా వెళుతూ, ప్రస్తుతం బలహీనంగా వున్న వారి వైపు ఎవరూ మొగ్గు చూపరు కనుక తను తీసినది 'నిజం' అని చెల్లుబాటు అయిపోతుందనే ధోరణిని వర్మ అనుసరించినట్టు అనిపిస్తుంది. నిజంగానే రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాల మీద ఎక్కువ ఫోకస్‌ పెట్టి, లక్ష్మీపార్వతిని బ్యాక్‌గ్రౌండ్‌కి పరిమితం చేసినట్టయితే దీనిని సీరియస్‌గా తీసుకునే వీలుండేది. కానీ అవసరానికి మించి ఎన్టీఆర్‌-పార్వతిల అనుబంధాన్ని హైలైట్‌ చేస్తూ వచ్చాడు. సదరు సన్నివేశాలు పేరడీ దృశ్యాలలా అనిపిస్తాయే తప్ప వారి మధ్య అనురాగం, అనుబంధాన్ని అర్థం చేసుకునేలా గొప్పగా అనిపించవు. వారి మధ్య సంభాషణలు కూడా మరీ నాటకీయంగా వుండడంతో పాటు ఎన్టీఆర్‌ అంతటి వాడే ఆమె గొప్ప జ్ఞానానికి, గుణానికి ప్రసన్నం అయిపోయినట్టుగా చిత్రీకరించారు. ఒక సందర్భంలో 'నేను వీక్‌గా వుండడం వల్ల కాసేపు పడుకున్నాను. మీరు వచ్చినది తెలియలేదు' అని ఎన్టీఆర్‌ అంటే, 'స్వామీ మీరెప్పుడూ వీక్‌ అనవద్దు. ఎన్టీఆర్‌ అంటేనే పవర్‌. మీరు పవర్‌కే పవర్‌' అంటుంది లక్ష్మి. ఇలాంటి హాస్యాస్పద సంభాషణలతో ఈ జంటని సీరియస్‌గా తీసుకునేదెలా?

ఇక చంద్రబాబు పాత్రని ఆది నుంచీ కుయుక్తులతో కుటిల రాజ నీతి చూపించే వ్యక్తిగానే చిత్రించడం కూడా దీనిని ప్రాపగాండా సినిమా అనుకునేలా చేస్తుంది. అవకాశాలని వాడుకుని పగ్గాలు చేజిక్కించుకున్నాడనేది మరింత డిగ్నిఫైడ్‌గా, డీసెంట్‌గా చూపించవచ్చు. కానీ చంద్రబాబు వున్న ప్రతి ఫ్రేమ్‌లోను కెమెరా అతనిపైనే ఫోకస్‌ పెట్టి, ఎప్పుడూ మైండ్‌లో ఏదో ప్లాన్‌ రన్‌ చేస్తున్నవాడిగా చూపించడం, దాని వెనుక ఠారెత్తించే నేపథ్య సంగీతం జోడించడం టూమచ్‌ అనిపిస్తుంది. సర్కార్‌ చిత్రంలోని చాలా షాట్స్‌ని వర్మ ఈ చిత్రంలో యథాతథంగా వాడుకున్నాడు. ఎన్టీఆర్‌ ఇంటితో పాటు అతను పార్టీ సభ్యులతో ఇంటరాక్ట్‌ అయ్యే సన్నివేశాలు సర్కార్‌లోని దృశ్యాలకి మక్కీకి మక్కీ అనిపిస్తాయి.

ఎన్టీఆర్‌లాంటి ప్రజానేత చనిపోయినపుడు ఆయన ఆత్మ కూడా 'లక్ష్మీ క్షమించు' అన్నట్టుగా ఘోషిస్తున్నట్టు పాట పెట్టడం ఇందులోని అతికి పరాకాష్ట. లక్ష్మీపార్వతిపై విపరీతమైన సింపతీ వచ్చేటట్టుగా లాస్ట్‌ సీన్‌లో ఆమెని అంతా వెనక్కి తోసేసి, గుంపు వెనకగా వెళ్లి పడిపోయినట్టు చూపించడం లాంటి అతి చేష్టలు సినిమా నిండా కోకొల్లలు. ఎన్టీఆర్‌తో పాటు వుండాలని, ఆమె పాద సేవ చేసుకోవాలని తప్ప లక్ష్మీపార్వతికి మరో ఉద్దేశం లేదని, ఆమెని అన్యాయంగా ఎన్టీఆర్‌ కుటుంబం, చంద్రబాబు చాలా బాధించారని చిత్రీకరించారు. పూర్తిగా చంద్రబాబు బద్ధ విరోధులకి తప్ప వర్మ టేక్‌ ఆన్‌ లక్ష్మీపార్వతి ఎపిసోడ్‌ ఎవరినీ కన్విన్స్‌ చేయదు.

దానికితోడు నాటకాన్ని తలపించే అభినయాలు, పాత్రధారులు ఈ చిత్రానికి సీరియస్‌నెస్‌ తీసుకురారు. పాటలే అక్కర్లేని ఈ చిత్రంలోకి అన్ని పాటలెందుకనేది వర్మకే తెలియాలి. పోనీ ఆ పాటలు వినసొంపుగా వున్నాయా అంటే అదీ లేదు. ఇటీవల అచ్చమైన కమర్షియల్‌ చిత్రాల్లో కూడా ఇన్ని పాటలుండడం లేదు. నేపథ్య సంగీతం వర్మ రెగ్యులర్‌ సినిమాల మాదిరిగా అవసరానికి మించిన ధ్వనితో ఇబ్బంది పెడుతుంది. నటీనటుల పరంగా చంద్రబాబుగా నటించిన శ్రీతేజ్‌ మెప్పించాడు. ఎన్టీఆర్‌, లక్ష్మీపార్వతి పాత్రధారులు మరింత కన్విన్సింగ్‌గా వుండాల్సింది.

రామారావు, లక్ష్మీపార్వతి మినహా ఎవరికీ అసలు పేర్లు పెట్టకపోయినా, వారిని ఎక్కడా పిలవకపోయినా చూడగానే వీరు ఫలానా అని గుర్తించేలా వారి వేష భాషలపై వర్మ తీసుకున్న శ్రద్ధ మాత్రం మెచ్చుకోతగింది. అయితే ఆహార్యం మినహా వారిలో చాలామంది ఆకట్టుకునేలా అభినయించలేక ఒక వీధి నాటకం లేదా ఏదో పేరడీ ఘట్టం చూస్తోన్న అనుభూతి కలిగించారు. ఇంటర్వెల్‌ తర్వాత వైస్రాయ్‌ ఘటన వరకు ఆసక్తికరంగానే నడిచిన ఈ చిత్రంలో ప్రథమార్థంలో ఎన్టీఆర్‌-లక్ష్మీల అనుబంధాన్ని కానీ, చివర్లో వచ్చే మోతాదు మించిన మెలోడ్రామాని కానీ భరించడం చాలా కష్టం. ఉన్నట్టుండి ఏడు పదుల వయసున్న ఎన్టీఆర్‌ తన భార్య లక్ష్మీపార్వతితో డాన్స్‌ చేసే సీన్‌ చూస్తే వర్మ ఈ చిత్రాన్ని ఆయనపై అభిమానంతో తీసాడా లేక ఆయన అభిమానులపై విరోధంతో తీసాడా అనిపిస్తే అది మీ తప్పు కాదు.

బాటమ్‌ లైన్‌: లక్ష్మీస్‌ లవ్‌స్టోరీ!
- గణేష్‌ రావూరి