తెలుగునాట ఈ మధ్యకాలంలో ఇలా ఓ సినిమాను ఆపడానికి ఇన్ని ప్రయత్నాలు జరిగిన దాఖలాలు లేవు. ఆర్జీవీ సంచలన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎలా వుంటుందో అన్న విషయం పక్కనపెడితే, అసలు విడుదల వుంటుందా? వుండదా? థియేటర్లు ఇస్తారా? ఇవ్వరా? అన్న విషయం వీర సస్సెన్స్ గా వుంది.
లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ఫస్ట్ అడ్డంకి సెన్సారు సర్టిఫికెట్. ఈ సాయంత్రం అయిదుగంటల వేళకు అయితే ఇంకా సర్టిఫికెట్ రాలేదు. దాదాపు 27 కట్స్ చెప్పి, సర్టిఫికెట్ అనౌన్స్ చేసారు అధికారులు. ఆ మేరకు కట్స్ చేసి మళ్లీ కాపీ లోడ్ చేయాలి. ఆపైన ముంబాయిలో సెంట్రల్ కమిటీ చూసి, ఆన్ లైన్ లో సర్టిఫై చేసాక సర్టిఫికెట్ ఇవ్వాలి. ఆ ప్రాసెస్ అలా పెండింగ్ లో వుంది. ఇధిలా వుంటే హైకోర్టులో లక్ష్మీస్ కు సంబంధించి కేసు విచారణ జరుగుతోందని తెలుస్తోంది.
థియేటర్లు లేవు….
ఇదిలావుంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ఎక్కడా థియేటర్లు లభించేలా లేవు. ఎమ్మెల్యేల నుంచి వస్తున్న బెదిరింపుల కారణంగా ఎవ్వరూ థియేటర్లు ఇవ్వడానికి ఇష్టపడడం లేదని వార్తలు అందుతున్నాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఉత్తరాంధ్రకు కొనుగోలు చేసిన బయ్యర్ నట్టికుమార్ 'గ్రేట్ ఆంధ్ర'తో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ థియేటర్ల ఓనర్లను బెదిరిస్తున్నారని అన్నారు.
దర్శకుడు వివి వినాయక్ థియేటర్ అయిన విశాఖ విమ్యాక్స్ కు కూడా బెదిరింపులు తప్పలేదన్నారు. చోడవరం, అనకాపల్లి, గాజువాక, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఆయా ఎమ్మెల్యేలు థియేటర్ల ఓనర్లను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై తాను ఈసాయంత్రం మీడియా ముందుకు వస్తానని ఆయన తెలిపారు.
నైజాంలో మాత్రం ఈ సమస్యలేదు. సీడెడ్ లో కూడా థియేటర్ల ఓనర్లకు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. థియేటర్ పై దాడి జరిగితే తమకు సంబంధం లేదు అని ఇన్ డైరక్ట్ గా ఓనర్లకు ప్రజా ప్రతినిధులు చెబుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద లక్ష్మీస్ ఎన్టీఆర్ వ్యవహారం కాస్త గట్టిగా బిగుసుకునేలాగే కనిపిస్తోంది.