దేవుడ్ని వరం అడుగుదాం అంటే.. పూజారి తలుపు తీయడంలేదు అన్న టైపులో వుంది మా కొత్త కార్యవర్గం పరిస్థితి. సభ్యులు నరేష్ ప్యానల్ ను గెలిపించి, శివాజీరాజా ప్యానల్ ను ఇంటికి పంపించారు. అయితే సాధారణంగా ఓ కమిటీకి కాలపరిమితి దగ్గరకు వచ్చాకనే ఎన్నికలు జరుపుతారు. అప్పటికి వున్న కమిటీనే ఎన్నికయితే ఏ గొడవాలేదు. అపోజిషన్ పార్టీ గెలిస్తే, ఇంకా కాలపరిమితి వున్నా కూడా, సాధారణంగా ముందు కమిటీ పక్కకు తప్పుకుని కొత్త కమిటీకి అవకాశం ఇస్తుంది.
కానీ ఇప్పుడు మా అసోసియేషన్ కు అలా జరగలేదని తెలుస్తోంది. తమ కమిటీ టైమ్ వున్నంత వరకు తామే వుంటామని, ఆ తరువాతే కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం చేయాలని పాత కమిటీ అధ్యక్షుడు శివాజీరాజా మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. అలాకాదని ప్రమాణ స్వీకారం చేస్తే, తాము కోర్టుకు వెళ్లి స్టే తెస్తామని హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఏం చేయాలా? అని నరేష్ అండ్ టీమ్ కిందామీదా అవుతోంది. ఈ మేరకు ఈ విషయం వివరించడానికి ఈ మధ్యహ్నం మీడియా ముందుకు వస్తోంది. ఇప్పటికే నరేష్ టీమ్ నుంచి ఆ నోటా ఈ నోటా ఈ విషయం లీక్ కావడంతో, శివాజీరాజా టీమ్ గౌరవంగా తప్పుకోకుండా ఇలా చేయడం ఏమిటి? అంటూ సినిమా వర్గాల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి.