దేవదాస్ తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చిన నాగార్జున ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నాడు. ఇప్పటికే మన్మధుడు-2 సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు చక్కబెట్టిన నాగార్జున, చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న బంగార్రాజును కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు.
అవును.. కల్యాణ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమా చేసేందుకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చాన్నాళ్లుగా ఈ సినిమా కథ మీద కూర్చున్న కల్యాణ కృష్ణ, ఎట్టకేలకు నాగ్ ను ఒప్పించగలిగాడు. జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
అయితే అంతకంటే ముందే మన్మధుడు-2 సినిమా సెట్స్ పైకి రాబోతోంది. నిజానికి ఈపాటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కావాలి. కానీ పోస్ట్ పోన్ అయింది. ఈ నెలలోనే ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. మన్మధుడు-2 సినిమా ఒక షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే, బంగార్రాజు సినిమా మొదలవుతుంది.
బంగార్రాజుకు సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఈ సినిమాలో తాతగా నాగ్, మనవడిగా నాగచైతన్య నటించబోతున్నారు. కథలో ఈ యాంగిల్ జోడించిన తర్వాతే నాగార్జునకు బంగార్రాజు స్క్రిప్ట్ నచ్చింది. మరో విశేషం ఏంటంటే.. ఈ రెండు సినిమాలు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైనే రాబోతున్నాయి.
ఇలా ఒకేసారి, తన సొంత బ్యానర్ పై 2 సినిమాలు సైమల్టేనియస్ గా నిర్మిస్తూ ఎప్పుడూ నటించలేదు నాగార్జున.