మహానటి సినిమాలో యాడ్ చేయని సీన్లను యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు. సినిమా లెంగ్త్ ఎక్కువవుతోందని కట్ చేసిన సీన్లను ఇలా ప్రేక్షకుల కోసం విడుదల చేస్తున్నట్టుగా రూపకర్తలు పేర్కొంటున్నారు. ఇలా విడుదల చేస్తున్న సీన్లలో కొన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి సీన్లనే ఈ సినిమా టీవీ యాడ్ టీజర్స్ గా వాడుకొన్నారు కూడా.
అలాంటి ఒకటీ అర సీన్లు ఒకే కానీ.. తాజాగా ఒక లెంగ్తీ సీన్‌ను నెట్లోకి వదిలారు. ఈ సీన్ చూశాకా.. అనిపించేది ఏమిటంటే, ఈ సీన్ గనుక సినిమాలో ఉండుంటే, కాస్త నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చేదని చెప్పకతప్పదు. విషాదంతం అయిన సావిత్రి జీవితం గురించిన ఈ సినిమాలో.. ఈ సీన్ కూడా ఉండుంటే.. ఆమెను చాలా చాలా అతి మంచి వ్యక్తిగా చూపించారు అనే అభిప్రాయం వినిపించేది.
ప్రత్యేకించి తమ కుటుంబ జీవితం గురించి సావిత్రి చాలా ఎక్కువ మంచిగా వ్యవహరించినట్టుగా సినిమాలో చూపించారని అనుకోవాల్సి వచ్చేది. ఎంత మంచి తనం అంటే.. జెమిని గణేషన్ రెండో భార్య(అనధికార) కూతుర్లను ఆయన గాలికి వదిలేస్తే, సావిత్రి వారిని చేర దీసిందని. వారి పట్ల బాధ్యతగా ఉండాలని జెమినిని సావిత్రే అడిగిందని. వాళ్లను ఇంటికి పిలిపించి వాళ్లనూ కుటుంబ సభ్యులుగానే చూసిందని ఈ సీన్లో చూపించారు.
తండ్రిగా జెమిని ఎలాంటి బాధ్యత తీసుకోకపోయినా, సవతి తల్లి అయినప్పటికీ సావిత్రే వాళ్లను ప్రేమగా చూసిందని ఈ సీన్లో చూపించారు. ఎందుకో చివరకు దీన్ని సినిమాలో యాడ్ చేయనట్టుగా ఉన్నారు. అయితే ఈ విషయాలను రేఖ ఎప్పుడూ చెప్పలేదు. తండ్రి తమను నిర్లక్ష్యం చేసినట్టుగా కూడా ఆమె ఎప్పుడూ వాపోలేదు. బయట ఉన్న ప్రచారం అయితే రేఖను ఆమె సోదరిని జెమిని పట్టించుకోలేదని అంటారు. దీన్ని కూడా అవకాశంగా తీసుకుని సావిత్రి మంచి తనాన్ని ఎలివేట్ చేసే సీన్‌ను రాసుకొన్నట్టుగా ఉన్నారు. అయితే రేఖ, జెమిని కూతుర్ల నుంచి అభ్యంతరాలు వస్తాయని కట్ చేసినట్టుగా ఉన్నారు.