మహానటి.. కథ ఎత్తుగడకు హాలీవుడ్‌ మూలం!

సోషల్‌ మీడియాలో విపరీతమైన స్థాయిలో అభినందనలు అందుకుంటున్న చిత్రం 'మహానటి'. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు లెక్కకు మించి ప్రశంసలు దక్కాయి. ప్రత్యేకించి తెలుగు సినీ ప్రేక్షకులు ఈ…

సోషల్‌ మీడియాలో విపరీతమైన స్థాయిలో అభినందనలు అందుకుంటున్న చిత్రం 'మహానటి'. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు లెక్కకు మించి ప్రశంసలు దక్కాయి. ప్రత్యేకించి తెలుగు సినీ ప్రేక్షకులు ఈ సినిమాను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. తాము ఆరాధ్యంగా చూసే అనేకమంది సినీతారలు ఒకే సినిమాలో కనిపించడం, భౌతికంగా దూరం అయిన వారిని మరోసారి తెరపై చూసే అవకాశం లభించినట్టుగా ఫీలయ్యారు ప్రేక్షకులు.

ఈ ఫీలింగ్‌ను కలిగించడంలో విజయవంతం అయ్యింది నాగ్‌అశ్విన్‌ అండ్‌ కో. సినిమాలో చూపినవన్నీ వాస్తవాలా? సావిత్రి జీవితకథ అలా మొదలై ఇలా ముగిసిందా? అనే సంగతులను పక్కనపెడితే, ఈ బయోపిక్‌ను జనరంజకంగా తీయడంలో విజయవంతం అయ్యాడు దర్శకుడు. ఈ సినిమా మరీ వివాదాస్పదం కాకపోవడం గమనార్హం. సినిమాలోని కొన్ని సీన్ల విషయంలో జెమిని గణేషన్‌ కూతుళ్లు అభ్యంతరం చెబుతున్నా… పెద్ద వివాదం అయితే కాలేదు.

అంతా మంచోళ్లే.. పరిస్థితుల ప్రభావం మేర అలా జరిగిందన్నట్టుగా.. సావిత్రి జీవితాన్ని తీసి చూపించారు. ఈ వాదనతో కొందరు ఏకీభవిస్తున్నారు, మరికొందరు ఏకీభవించలేరు. సినిమా వరకూ జరిగినదాంట్లో ఎవరి తప్పేం లేదన్నట్టుగా కన్వీన్సింగ్‌గా చూపించేశారు. సావిత్రి జీవితం గురించి ఇన్నాళ్లూ ప్రచారంలో ఉండిన అనేక అంశాలకు కూడా కొంత ఫుల్‌స్టాప్‌ పెట్టింది మహానటి. ఆమె జీవితం అత్యంత విషాదభరితంగా గడిచిందని, ఆఖరికి సావిత్రి తన చరమాంకంలో కార్లషెడ్లో ఉండే వారని కూడా కొంతమంది ప్రముఖులు చెప్పిన వైనం ప్రచారంలో ఉంది.

ఈ మధ్య కాలంలోనే సీనియర్‌ నటి, సావిత్రి సమకాలీనురాలైన జమున సావిత్రి గురించి కొన్ని విషయాలను చెప్పారు. ఇక సావిత్రి జీవితం గురించిన మరో ప్రధానమైన అంశం.. ఆమె కూతురు, కొడుకు తండ్రి జెమిని గణేషన్‌ను మరీ ధ్వేషించకపోవడం. పాత ఇంటర్వ్యూల్లో సావిత్రి కూతురు జెమినిని కొంత నిందించినట్టుగా కనిపిస్తుంది కానీ.. కాలక్రమంలో ఆమె ధోరణిలో కూడా చాలామార్పే ఉంది. అదంతా వారి వ్యక్తిగతం. మనుషుల అభిప్రాయాలు ఎప్పుడూ ఒకేలా ఉండాలని లేదు కదా. ఇక జెమిని వారసుల్లో ఆస్తుల గొడవలు కూడా ఏమీ ఉన్నట్టుగా కనిపించవు.

సినిమాకు సంబంధించిన ఈ సంగతులు, వాస్తవంతో వాటికి పోలికెంత అనే సంగతులు పక్కన పెడితే, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమా కథ చెప్పిన వైనం గురించి కొంత చర్చించవచ్చు. ఒక జర్నలిస్టు సావిత్రి జీవితం గురించి చేసిన పరిశోధనలా ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు. అయితే ఆ జర్నలిస్టు కూడా ఈ తరానికి చెందిన వ్యక్తి కాదు. సావిత్రి మరణించిన సమయానికి సంబంధించిన జర్నలిస్టు. ఇదీ నాగ్‌ అశ్విన్‌ ఎత్తుగడ. సావిత్రి కథను డైరెక్టుగా చెప్పకుండా, జర్నలిస్టు పరిశోధన ద్వారా రకరకాల పాత్రల చేత చెప్పించాడు.

సావిత్రి చివరి సారిగా రాసిన ఒక లెటర్‌తో కథను మొదలుపెట్టాడు. ఆ లెటర్లోని 'శంకరయ్య' అనే పాత్రను పజిల్‌గా మార్చి.. శంకరయ్య ఎవరు? అనే అంశంతో కథను మొదలు పెట్టాడు. శంకరయ్య ఎవరు? చివర్లో అతడిని కలవాలని సావిత్రి ఎందుకు అనుకుంది? అనే అంశంపై సమంత పాత్ర పరిశోధన మొదలుపెడుతుంది. వాస్తవానికి ఇక్కడ కొంత గందరగోళం కూడా ఉంది.

సావిత్రి జీవితం గురించి సమంత పరిశోధన అంత స్ట్రిక్ట్‌గా ఏమీ జరగదు. ఆమె పరిశోధించేసి కనుగొనే విశేషాలు ఏమీ ఉండవు. కథంతా తనదారిన తాను సాగిపోతుంటే, మధ్యలో సమంత ఈ విషయమై పరిశోధిస్తోందన్న సీన్లను చూపించారంతే. అయితే ప్రేక్షకుల ఆసక్తి సావిత్రి జీవితం గురించి కానీ, సమంత పరిశోధన గురించి కాదు కదా, కాబట్టి.. ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

ఇక సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన 'మహానటి'పై ప్రఖ్యాత హాలీవుడ్‌ చిత్రం 'సిటిజన్‌ కేన్‌' ప్రభావం ఉందని చెప్పకతప్పదు. ఒక బయోపిక్‌పై హాలీవుడ్‌ సినిమా ప్రభావం ఏమిటి? అంటే.. కథ చెప్పే ఎత్తుగడ విషయంలో సిటిజన్‌ కేన్‌ను అనుకరించాడు నాగ్‌ అశ్విన్‌. హాలీవుడ్‌ సినీ ప్రియుల్లో చాలామందికి పరిచయం ఉన్న సినిమా సిటిజన్‌ కేన్‌. ఇదొక సూపర్‌ హిట్‌, క్లాసిక్‌, ఏకంగా తొమ్మిది కేటగిరీల్లో ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యి, కొన్ని కేటగిరీల్లో ఆస్కార్స్‌ను అందుకున్న సినిమా.

సిటిజన్‌ కేన్‌కు, మహానటికి సంబంధం ఏమిటి? అంటే.. సమంత చేతికి దొరికే లెటర్లో 'శంకరయ్య' ప్రస్తావన ఉంటుంది. (శంకరయ్య పేరును సంకరయ్య అంటూ సమంత పలుకుతుంది సినిమా అంతా. చాలా కృతంగా ఉంది ఇలా పలకడం. సమంత చేత డబ్బింగ్‌ చెప్పించిన దర్శకుడు ఆమె ఒక మంచి పేరును సంకరం చేసిందనే విషయాన్ని దర్శకుడు గమనించకపోవడం గమనార్హం.) ఆ శంకరయ్య ఎవరు అనే అంశంపై పరిశోధన. ఆ పరిశోధన చుట్టూ కథంతా చెప్పడం.

చివరకు ఆ శంకరయ్య ఎవరో సదరు జర్నలిస్టు తెలుసుకోలేకపోవడం. తెలుసుకోవాల్సిన అవసరం లేదని కూడా తేల్చేయడం. చివర్లో టైటిల్స్‌ పడే సమయంలో ఆ శంకరయ్య ఎవరో ప్రేక్షకులకు మాత్రమే అర్థమయ్యేలా సినిమాను ముగించడం. శంకరయ్య ఎవరో అసలు పాత్రధారికి, ప్రేక్షకుడికి మాత్రమే తెలుస్తుంది. సినిమాలోని ఇంకెవరికీ ఆ విషయం తెలియదు. సావిత్రి బయోపిక్‌లో ఇదంతా కల్పితమే.

దానికి రుజువు సిటిజన్‌ కేన్‌ సినిమా. సిటిజన్‌ కేన్‌ కథ కూడా ఇలాగే సాగుతుంది. ఒక కల్పిత పాత్ర బయోపిక్‌ ఆ సినిమా. తన జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగిన ఒక వ్యాపారవేత్త మరణించే ముందు 'రోజ్‌ బడ్‌' అంటూ కలవరిస్తాడు. అది అతడి చివరి పలుకు. దాన్ని రికార్డు చేస్తారు డాక్టర్లు. ఇంతకీ రోజ్‌ బడ్‌ ఏమిటి? అంటూ మీడియా పరిశోధన ప్రారంభిస్తుంది. ఆ పరిశోధనతో అతడి జీవిత కథ అంతా చెప్పిస్తారు.

చివరకు 'రోజ్‌ బడ్‌' అంటే ఏమిటో, ఆ పేరును ఆ వ్యాపారవేత్త ఎందుకు కలవరిస్తాడో తేల్చలేరు. రోజ్‌ బడ్‌ అంటే ఏమిటి? అంశంపై అనేక రకాలుగా పరిశోధిస్తారు. అతడి రహస్య ప్రియురాలి పేరా? అంటూ మొదలుపెట్టి అనేక కోణాల్లో పరిశోధిస్తారు. అయితే తేల్చలేరు. ఇక తేల్చలేమని కేసును మూసేస్తారు. అప్పుడు ఎండింగ్‌ టైటిల్‌ కార్డ్స్‌ పడుతుండగా.. ఆ వ్యాపారవేత్త వస్తువులన్నింటినీ కాల్చేస్తూ ఉండగా.. ఒక ఆటబొమ్మ మీద ఉంటుంది 'రోజ్‌ బడ్‌' అని. దాన్ని ఎవరూ గమనించకుండానే కాల్చేయడంతో సినిమా ముగుస్తుంది. సిటిజన్‌ కేన్‌లో 'రోజ్‌ బడ్‌', మహానటిలో 'శంకరయ్య' రెండూ ఒకటే! సావిత్రి కథను చెప్పడానికి 'సిటిజన్‌ కేన్‌' ఎత్తుగడను ఎంచుకున్నాడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.