మహేష్ బాబు లేటెస్ట్ మూవీకి రెండు సినిమాలు స్పీడ్ బ్రేకర్లుగా మారుతున్నాయా? అశ్వనీదత్ నిర్మించిన దేవదాస్, పివిపి నిర్మించిన బ్రహ్మోత్సవం లావాదేవీలు మహర్షికి అడ్డం పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈస్ట్ గోదావరిలో లోకల్ అసోసియేషన్ తీర్మానం చేసింది. వి 4 సంస్థకు అశ్వనీదత్ బాకీ తీర్చేవరకు మహర్షి సినిమాను విడుదల చేయకూడదని. నెల్లూరు, కృష్ణ, గుంటూరు తదితర ప్రాంతాల్లో కూడా ఇదే తకరారు వుంది.
ఇక్కడ దేవదాస్ సినిమా సమస్యకాదు. దేవదాస్ సినిమా విడుదల టైమ్ లో వాల్యూ కన్నా అదనంగా డబ్బులు ఇవ్వమని అశ్వనీదత్ అడిగి తీసుకున్నట్లు బోగట్టా. వాటిని ఫలానా టైమ్ లోగా సెటిల్ చేస్తానని, ఇవ్వకపోతే వడ్డీతో ఇస్తానని లిఖితపూర్వక అగ్రిమెంట్లు వున్నాయి. అందువల్ల దేవదాస్ సినిమా మీద మచ్చపడింది.
మరోపక్క సీడెడ్ లో బ్రహ్మోత్సవం వ్యవహారం రేగుతున్నట్లు తెలుస్తోంది. ఆ లావాదేవీలు ఇప్పుడు బయటకు వస్తున్నట్లు బోగట్టా. మొత్తంమీద చూస్తుంటే మహర్షి సినిమాకు చిక్కులు తప్పేటట్లు లేవు. నైజాంలో మాత్రం దేవదాస్ బకాయిలు వున్న ఆసియన్ సునీల్ ప్రస్తుతానికి వేచిచూచే ధోరణిలో వున్నారు.