మహర్షి సినిమా వాయిదా పడబోతున్నట్టు ఈమధ్య కాలంలో వరుసగా కథనాలు వచ్చాయి. ఏప్రిల్ నుంచి ఏకంగా జూన్ కు సినిమా పోస్ట్ పోన్ అయ్యే ప్రమాదం ఉందంటూ గాసిప్స్ వినిపించాయి. మార్కెట్లో ఇంత చర్చ జరుగుతుంటే యూనిట్ మాత్రం చలనం లేకుండా కూర్చుంది. ఆఖరికి స్వయంగా మహేష్ బాబు రంగంలోకి దిగి క్లాస్ పీకితే తప్ప, యూనిట్ దీనిపై స్పందించలేదు.
అవును.. మహర్షి వాయిదాపై వరుసగా వస్తున్న కథనాలపై మహేష్ సీరియస్ అయ్యాడట. దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు ఇద్దర్నీ కూర్చోబెట్టి క్లాస్ పీకాడట. ఎట్టిపరిస్థితుల్లో సినిమా ఏప్రిల్ లో థియేటర్లలోకి రావాల్సిందేనని కండిషన్ పెట్టాడట. పనిలోపనిగా మీడియాకు అప్ డేట్ ఇవ్వమని కూడా సూచించాడట.
మహేష్ చొరవతో మహర్షి యూనిట్ కదిలింది. మార్చి 15 నాటికి 2 పాటలు మినహా టోటల్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుందని ప్రకటించిన యూనిట్.. సినిమాను ఏప్రిల్ 25న థియేటర్లలోకి తీసుకొస్తామని మరోసారి కన్ ఫర్మ్ చేసింది. తాజా ప్రకటనతో మహర్షి విడుదల వాయిదాపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. మహేష్, అల్లరినరేష్ మధ్య కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత, ఫిలింసిటీలోనే ఓ పాటను తెరకెక్కిస్తారు. టైమ్ ఉంటే మరో పాట కోసం విదేశాలకు వెళ్తారు. లేదంటే ఆ ఒక్కపాటను కూడా సెట్ లోనే కానిచ్చేస్తారు.