విభజన హామీల్లో అత్యంత ప్రధానమైనవి రెండే.. ఒకటి హోదా. రెండవది జోన్. హోదా విషయంలో ఎందుకో బాజపా చాలా మొండిగా పట్టుదలగా వుంది. జోన్ విషయంలో భాజపా సమస్య పక్కనున్న ఒరిస్సాతోనే. అయితే ఒరిస్సాలో వున్నది భాజపా మిత్ర ప్రభుత్వమే. అందువల్ల కావాలంటే ఒరిస్సాకి అభ్యంతరం లేనివిధంగా జోన్ తయారుచేసి ఇవ్వొచ్చు.
ఇప్పుడు భాజపా అదే పని చేయబోతోందని వార్తలు అందుతున్నాయి. ఈ విధంగా మోడీ ప్రభుత్వం చంద్రబాబును రెండు విధాల ఇరుకున పెట్టే అవకాశం వుంది. ఒకటి హోదా విషయంలో బాబు ఎప్పడో ఒకటికి రెండుసార్లు మాట మార్చారు. ప్యాకేజీని అంగీకరిస్తూ తీర్మానాలు చేసారు. అందువల్ల ఆ విషయంలో బాబుకు మైనస్ పాయింట్లు వున్నాయి.
ఇక రెండోది బాబుకి ఆయన వర్గానికి విజయవాడ కేంద్రంగా రైల్వేజోన్ వస్తే బాగుండును అని వుంది. ఎప్పటి నుంచో అది మనసులోనే వుంది. ఒకరిద్దరు రాజకీయ నాయకులు మాత్రం ఆ ప్రస్తావన చేసి వదిలేసారు. అది టచ్ చేస్తే విశాఖ ప్రాంతీయుల మనోభావాలు దెబ్బతింటాయని సైలెంట్ వున్నారు.
ఇప్పుడు మోడీ విశాఖ జోన్ ప్రకటిస్తే, భవిష్యత్ లో విజయవాడ జోన్ చాన్స్ వుండదు. అమరావతి పేరే కానీ అన్నీ వున్నది విజయవాడ, గుంటూరు మధ్యలోనే. ఆ విధంగా జోన్ ను అక్కడకు రాకుండా చేసినట్లు అవుతుంది. విభజన హామీలు అన్నీ నెరవేర్చాం అని చెప్పడానికి అవుతుంది.
ఉత్తరాంధ్రలో భాజపా జనాలు కాస్త తలెత్తుకు తిరగడానికి వీలు అవుతుంది. ఇప్పటికే బాబు సామాజిక వర్గానికి చెందిన కంభంపాటి హరిబాబు సైలంట్ అయిపోయారు. విష్ణుకుమార్ రాజు మాత్రం పార్టీని పట్టుకుని వున్నారు. ఇప్పుడు జోన్ ఇస్తే, భాజపా జనాలు మళ్లీ బయటకు వస్తారు.
ఇదిలావుంటే జోన్ ఇచ్చేస్తారన్న వార్తలు రావడంతో చంద్రబాబు అర్జెంట్ గా కేంద్రానికి లేఖ రాసారు. జోన్ ఇచ్చితీరాలి అంటూ. చావు తెలివితేటలు అంటే ఇవేనేమో? బాబుగారు ఇలాంటివి గతంలో కూడా చాలా చేసారని విమర్శలు వున్నాయి. ఏం జరిగినా తన క్రెడిట్ అనే ప్రయత్నం అన్నమాట.
ఇదిగో చూసారా? నేను లేఖ ఇచ్చా, జోన్ వచ్చింది అని చెప్పుకోవడానికి. తెలంగాణలో ఇలాగే చేసారు. తాను విభజన లేఖ ఇచ్చాకే రాష్ట్రం వచ్చిందని అక్కడి వాళ్లకు చెప్పే ప్రయత్నం చేసారు. ఇప్పుడు రైల్వేజోన్ కూడా తన ఘనతే అని టముకు వేసే ప్రయత్నం స్టార్ట్ అయింది అన్నమాట.
మోడీ విశాఖ రాబోతున్నారు. అక్కడి సభలో కానీ, రావడానికి ముందు కానీ జోన్ ప్రకటన వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. జోన్ వస్తే, ఉత్తరాంధ్ర ఎంపీ స్థానాల్లో భాజపా గట్టి పోటీ ఇచ్చే అవకాశం వుంటుంది.