ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టార్ కథానాయకులు కాల్షీట్లు ఇవ్వడమే గొప్ప. ఇక వాళ్లకి లేనిపోని కండిషన్లు పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం అంతే సంగతులు. మొహమాటం లేకుండా `సినిమా చేయం పో…` అనేస్తారు. తాజాగా టాలీవుడ్లో యుటీవీ సంస్థకి అలాంటి అనుభవమే ఎదురైంది. ప్రముఖ కథానాయకుడు మహేష్ బాబు ఆ సంస్థపై కన్నెర్రజేశాడు. మీకో దండం, మీ సినిమాకో దండం అంటూ గుడ్‌బై చెప్పేశాడట.
అసలు విషయమేమిటంటే… మహేష్‌బాబు కథానాయకుడిగా యుటీవీ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్ చేసింది. కొరటాల శివ ఆ సినిమాకి దర్శకుడు. రేపోమాపో కొబ్బరికాయ కొట్టాలని కూడా అనుకొంటున్నారు. కానీ ఇంతలో యుటీవీ సంస్థ మహేష్‌కి కొన్ని కండిషన్లు పెట్టిందట. ఆ కండిషన్లకి సంబంధించిన అగ్రిమెంట్లపై సంతకాలు పెట్టమందట. ఆ వ్యవహారం మహేష్‌కి నచ్చలేదట.
అందుకే ఆ సంస్థకి సినిమా చేయకూడదని నిర్ణయించుకొన్నాడట. వేరొక ప్రొడ్యూసర్‌తో ఆ సినిమా చేయాలని మహేష్ నిర్ణయం తీసుకొన్నాడట. అడ్వాన్సుగా తీసుకొన్న అమౌంట్‌ని కూడా మహేష్ ఆ సంస్థకి తిప్పి పంపబోతున్నాడట. ఇదివరకు ఇదే సంస్థలో మహేష్ `అతిథి` సినిమా చేశాడు. `1` సినిమాని కూడా ఈ సంస్థే విడుదల చేసింది.