ప్రస్తుతం 15రోజుల యుఎస్ షెడ్యూలుతో బిజీగా వున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహర్షి సినిమా షూటింగ్ జరుగుతోంది అక్కడ. అయితే ఇక్కడ మరోపక్క దర్శకుడు సుకుమార్ రెండు సబ్జెక్ట్ లతో వెయిట్ చేస్తున్నారు. మైత్రీమూవీస్-సుకుమార్-మహేష్ బాబు కాంబినేషన్ ప్లస్ నిర్మాణ భాగస్వామ్యంతో తరువాత సినిమాకు ఏర్పాట్లు రెడీగా వున్నాయి. అయితే సబ్జెక్ట్ ఓకె కావాలి.
ఇప్పటికే మహేష్ కు సుకుమార్ ఓ సబ్జెక్ట్ చెప్పారు. తెలంగాణలో రజాకార్ల ఉద్యమకాలం నేపథ్యంలో జరిగిన పీరియాడిక్ లైన్ అది. అయితే మహేష్ దానికి అంత సుముఖంగా లేరని తెలుస్తోంది. దాదాపు ప్రతి హీరో చేతిలో ఇప్పుడు ఓ పీరియాడిక్ సినిమా వుంది. అందువల్ల మళ్లీ తను కూడా అదే జోనర్ చేయడమా? అన్నది ఓ పాయింట్.
అలాగే రజాకార్ల మూవ్ మెంట్ కథాకాలం అంటే మళ్లీ లేనిపోని అభ్యంతరాలు ఏవైనా వచ్చే ప్రమాదం వుందా అన్నది ఇంకోటి. వీటన్నింటికి మించి మహేష్ సహజంగా డిఫరెంట్ సినిమాలకు దూరంగా వుంటారు. శ్రీమంతుడు అయినా, సిఎమ్ అయినా, ఆయన గ్లామర్ కీలకంగా వుండాలి.
అది కీలకంగా చూసుకుంటాడు మహేష్ బాబు. అందుకే ఆయనకు మేకోవర్ అన్నది చాలా తక్కువగా వుంటుంది. అందుకే పీరియాడిక్ సినిమా కాకుండా మరో సబ్జెక్ట్ కూడా చూడమని చెప్పినట్లు తెలుస్తోంది. సుకుమార్ దగ్గర దాదాపు సగానికి పైగా సీన్లు కూడా రాసేసిన ఇంకో స్క్రిప్ట్ వుందట. ఇప్పుడు దాన్ని మహేష్ కు వినిపించడానికి సుకుమార్ రెడీగా వున్నారు.
నవంబర్ 4 తరువాత మహేష్ ఇక్కడకు వస్తారు. రాగానే రెండు సబ్జెక్ట్ లు పూర్తిగా వినిపించి, ఒకటి ఫైనల్ చేసుకునేందుకు రెడీగా వున్నారు సుకుమార్. వన్స్ గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తే, వీలయినంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేయాలన్నది సుకుమార్ ఆలోచన అని వినిపిస్తోంది ఇండస్ట్రీలో.