కొన్నిరోజుల కిందటి సంగతి.. మహేష్ కు బాబుకు ఓ లైన్ చెప్పానని, ఆయనతో స్టోరీ డిస్కషన్స్ ప్రాధమిక దశలో ఉన్నాయని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్వయంగా ప్రకటించాడు. తను చెప్పిన కథ ఓ డార్క్ క్రైమ్ స్టోరీ జానర్ కు చెందినదనే విషయాన్ని కూడా అప్పట్లో సందీప్ రెడ్డి బయటపెట్టాడు. కట్ చేస్తే, ఆ తర్వాత చర్చలు ఆగిపోయాయి. సందీప్ బాలీవుడ్ కు వెళ్లి అర్జున్ రెడ్డి రీమేక్ (కబీర్ సింగ్) చేశాడు. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను కూడా హిందీలోనే ప్లాన్ చేశాడు ఈ దర్శకుడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. గతంలో మహేష్ కు చెప్పిన కథనే ఇప్పుడు హిందీలో తీయబోతున్నాడు ఈ డైరక్టర్.
అవును.. రీసెంట్ గా రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి మధ్య కథాచర్చలు జరిగాయి. గతంలో మహేష్ కు చెప్పిన డార్క్ క్రైమ్ స్టోరీనే రణబీర్ కు చెప్పాడట సందీప్. స్టోరీలైన్ నచ్చడంతో రణబీర్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు డెవిల్ అనే టైటిల్ అనుకుంటున్నారు. త్వరలోనే వీళ్లిద్దరి కాంబోలో సినిమాపై అధికారికంగా ప్రకటన రాబోతోంది. నిజానికి కబీర్ సింగ్ తర్వాత తెలుగులోనే సినిమా చేయాలనుకున్నాడు సందీప్ రెడ్డి.
అయితే కబీర్ సింగ్ భారీ విజయం సాధించడంతో ఆయనకు బాలీవుడ్ హీరోల నుంచి ఎక్కువ ఆఫర్లు వచ్చాయి. పైగా తన నెక్ట్స్ సినిమాను మరింత బోల్డ్ గా తీస్తానని, ఏం చేసుకుంటారో చేసుకోండంటూ బాలీవుడ్ క్రిటిక్స్ కు సవాల్ విసిరాడు సందీప్. క్రిటిక్స్ పేర్లు చెప్పి మరీ సవాల్ విసిరాడు. అతడు తీసిన కబీర్ సింగ్ సినిమాను బాలీవుడ్ క్రిటిక్స్ చాలా విమర్శించారు. సో.. డెవిల్ సినిమాను మరింత బోల్డ్ గా, రఫ్ గా తీయబోతున్నాడు సందీప్ రెడ్డి.
ఈ సంగతి పక్కనపెడితే.. మహేష్ రిజెక్ట్ చేయడంతోనే ఆ కథను ఇలా హిందీలో ప్లాన్ చేశాడు సందీప్ రెడ్డి. అన్నట్టు ఈ మూవీతో బాలీవుడ్ కు నిర్మాతగా కూడా పరిచయమవ్వాలనుకుంటున్నాడు సందీప్.