మీసాలరామ్..ఉరఫ్ సాక్షి రామ్ అందరికీ పరిచయమైన పేరు. సాక్షి పత్రిక ప్రారంభమైన కొత్తలో ఫ్యామిలీ సెక్షన్ ను విజయవంతంగా నడిపించిన వ్యక్తి. ఆ తరువాత సాక్షి టీవీకి వెళ్లారు. ఇప్పుడు మళ్లీ సాక్షి పత్రికకు వచ్చారు. ఫ్యామిలీ సెక్షన్ హెడ్ గా మంగళవారం నుంచి బాధ్యతలు స్వీకరించారు. రామచంద్రమూర్తి ఎడిటోరియల్ డైరక్టర్ గా సాక్షిలోకి వచ్చిన నాటి నుంచి క్రమక్రమంగా జరుగుతున్న మార్పుల్లో ఇది ఒకటి.
సాక్షి టీవీ పగ్గాలను కూడా తన చేతుల్లోకి తీసుకోవాలనుకున్నారు రామచంద్రమూర్తి. అందులో భాగంగా అక్కడున్న రామ్ ను ముందు తప్పించాలి కాబట్టి, తీసుకువచ్చి ఆయనకు అలవాటైన ఫ్యామిలీలోపడేసారు. ఒక విధంగా ఇది రామ్ రెడ్డికి డిమోషన్ అనుకోవాలి. ఎందుకంటే మొత్తం టీవీ వ్యవహారాలు చూడడం వేరు. కేవలం పత్రికలో ఒక్క సెక్షన్ చూడడం వేరు. అయితే రామ్ రెడ్డికి ఇవేవీ పట్టవు. అందుకే ఆయన మంగళవారం కొత్త పోస్టులోకి వస్తూనే, చకచకా మీటింగ్ ల మీద మీటింగ్ లు కానిచ్చేసారు.
రాత్రి పొద్దుపోయే వరకు సాక్షి ఫ్యామిలీకి మళ్లీ కొత్త లుక్ ఎలా తీసుకురావాలా అన్నదానిపై డిస్కషన్లు నడిచాయి. నిజానికి సాక్షి ఫ్యామిలీకి రామ్ ఓ గ్లామర్, ఓ ఇమేజ్ తెచ్చారు. ఆయన వెళ్లిన తరువాత దానిపై చాలా ప్రయోగాలు జరిగాయి. చాలా మంది మారారు కూడా. ఇందిరా పరిమి, సరికొండ చలపతి ఇలా చాలా మంది వచ్చారు.
సాక్షి లో ఫ్యామిలీ సెక్షన్ పై జరిగినన్ని ప్రయోగాలు మరే సెక్షన్ లోనూ జరగలేదంటే అతిశయోక్తి కాదు. హెచ్ ఎమ్ టీ వి స్థాపించి, నిర్వహించిన అనుభవంతో సాక్షి టీవీ ని కూడా తన చేతుల్లోకి తీసుకున్నారు రామచంద్రమూర్తి. దాంతో రామ్ కు ప్లేస్ మార్పు తప్పలేదు.