ఇప్పటికే ముల్లాలు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పై జారీ చేసిన ఫత్వాలు పెండింగ్ లో ఉన్నాయి. ఒక ముస్లిం అయిన సల్మాన్ మతాపచారాలకు పాల్పడ్డాడని అంటూ ఫత్వాలు జారీ అయ్యాయి. ఆ మధ్య ముంబైలో సల్మాన్ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని హారతి ఇచ్చినందుకు ముల్లాలు ఆగ్రహించారు. అలా హిందూ దేవాలయానికి హాజరైన ఈ సెలబ్రిటీకి శిక్ష అంటూ.. ఫత్వా జారీ చేశారు.
దేశ వ్యాప్తంగా ఆ మూల నుంచి ఈ మూల వరకూ సల్మాన్ విషయంలో చాలా ఫత్వాలే వచ్చాయి. అయితే సల్మాన్ మాత్రం వాటిని లైట్ తీసుకొన్నాడు. ఇప్పుడు మరోసారి ఆ విషయం స్పష్టం అయ్యింది. కృష్ణ జింకలు వేటాడిన కేసులో కోర్టుకు హాజరైన ఈ హీరో అక్కడ జడ్జి సల్మాన్ కులం గురించి అడిగారు. సహజమైన ప్రొసీజర్ లో భాగంగా సల్మాన్ తన మతం, కులం గురించి చెప్పాల్సి వచ్చింది.
ఈ సందర్భంగా సల్లూ తను ఇండియన్ అని సమాధానం ఇచ్చాడు. అయితే ఇండియన్ అనేది మతం కాదు, కులం కాదు.. మీ కులం ఏమిటో చెప్పండి అని కోర్టు అడిగే సరికి తన తండ్రి ముస్లిం అని, తల్లి హిందూ అని తను ఏ మతం అవుతానో మీరే డిసైడ్ చేయాలన్నట్టుగా సల్మాన్ మాట్లాడాడు. తర్వాత ఆ టాపిక్ కు పొడిగింపు లేకుండా పోయింది.
ఇది వరకూ కూడా సల్మాన్ ఈ విషయాలను అనేక సార్లు చెప్పుకొన్నాడు. తన తండ్రి ముస్లిం అని తల్లి హిందూ అని.. ఆమె ఇంట్లో హిందూ దేవుళ్లకు పూజలు చేస్తుందని.. తన తండ్రి రెండో భార్య, పినతల్లి క్రిస్టియన్ అని.. ఇలా తమ ఇళ్లు సర్వమత సమ్మేళనంగా ఉంటుందని సల్మాన్ చెప్పాడు. మరి ఇప్పుడు సల్మాన్ మాటలపై ముస్లిం మత పెద్దలకు కోపం వచ్చి ఏమైనా ఫత్వాలు జారీ చేస్తారేమో చూడాలి!