సినిమా జనాలు కిందపడ్డా మీద పడ్డాం అంటారు. వెనకటికి ఒక సామెత వుంది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసాడని. సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యవహారం అలాగే వుంది. ఆయన భాగస్వామిగా వున్న ఎఎమ్ బి మల్టీఫ్లెక్ లో జీఎస్టీకి అనుగుణంగా టికెట్ రేట్లు తగ్గించలేదు. అది తప్పు. ప్రభుత్వం టాక్స్ తగ్గించాక రేట్లు తగ్గించాలి. అలా తగ్గించకుండా జనాల ముక్కుపిండి వసూలు చేసారు.
తీరా అధికారులు ఆ తప్పిదం గమనించాక, లేదా పట్టుకున్నాక, డబ్బులు కట్టేయక తప్పలేదు. అవన్నీ వార్తలుగా వచ్చాయి. మరి దానిని ఎలా సవరించుకోవాలి. డ్యామేజ్ ఎలా కంట్రోల్ చేయాలి. జీఎస్టీ తగ్గించకుండా అదనంగా ప్రేక్షకుల దగ్గర నుంచి వసూలు చేసిన సొమ్ము 35,66 లక్షలు అని లెక్కతేల్చారు. ఇప్పుడు ఈ అమౌంట్ ను వినియోగదారుల సంక్షేమ నిధికి విరాళంగా ఇచ్చారట మహేష్ బాబు. ఆ మేరకు ప్రెస్ నోట్ ఒకటి.
అసలు ఇది విరాళం ఎలా అవుతుంది? ఎవరి సొమ్ము? ఎవరు విరాళం ఇస్తారు? నిజానికి అది జనం సొమ్ము. జనానికి రిటర్న్ ఇవ్వాలి. అది సాధ్యంకాదు. అందుకే ఇలాంటి మార్గం అధికారులు సూచించి వుంటారు. అలాంటపుడు ఇచ్చేసి సైలంట్ గా వుండాలి. మళ్లీ అదేదో గొప్ప పని చేసినట్లు ప్రకటన ఒకటి.
ఇప్పటికే నట్టికుమార్ లాంటి వాళ్లు థియేటర్లు పన్నులు కట్టడంలో అనేక అవకతవకలు వున్నాయని, అయితే థియేటర్ల పెద్దలు, ప్రభుత్వాలు నడిపే రాజకీయనాయకులతో చెట్టాపట్టాలు వేయడంతో, అవన్నీ బయటకు రావడంలేదని అనేకసార్లు ఆరోపించారు. ఇప్పుడు ఈ జీఎస్టీ వార్తలు వింటుంటే అవన్నీ గుర్తుకు వస్తుంటాయి.
అవును, అంతా బాగానే వుంది. ఎఎమ్ బి మాల్ మహేష్ ఒక్కరిదే కాదు కదా? మరేదో ఆయనే డొనేషన్ ఇచ్చినట్లు బిల్డప్ ఏమిటో?