శంకర్-ఆస్కార్ రవిచంద్రన్-విక్రమ్ ల కాంబినేషన్ లో తయారవుతున్న భారీ సినిమా మనొహరుడు. దీనికి ఇస్తున్న బిల్డప్పులు, హైప్ ఇంతా అంతా కాదు. 180 కోట్ల భారీ బడ్జెట్ అని చెప్పి, తెలుగునాట 35 కోట్లు హక్కుల రూపంలో లాగాలని చూస్తున్నారు. నిజానికి అసలు సిసలు ఖర్చు వంద కోట్లే అని, భారీ అమ్మకాల కోసం కాస్త పెంచారని వినికిడి. సినిమా సూపర్ హిట్ అయితే తెలుగునాట ముఫై అయిదు కోట్లు రావడం పెద్ద కష్టం కాదు. కానీ గాడి తన్నితే సికిందర్ లా కుదేలైపోవాలి. రభస మాదిరిగా ఇరవై దగ్గర ఫుల్ స్టాప్ పడిపోతుంది.
అయితే తెలుగు శాటిలైట్ హక్కులకు ఆరేడు కోట్ల వరకు వచ్చే అవకాశం వుంది. అందువల్ల ఇరవైకి కొనడం పెద్ద రిస్క్ కాదని సినిమా జనాల అభిప్రాయం. అయితే ముఫై, ముఫై అయిదుకు తగ్గమని రవిచంద్రన్ – శంకర్ ద్వయం అంటున్నారట. పైగా అదో పెద్ద బంపర్ ఆఫర్ అన్నట్లు, ముఫై అయిదుకు రెడీ అయితే, అగ్రిమెంట్ చేసుకుంటే సినిమా చూపిస్తామని, అప్పుడు మీకే తెలుస్తుందని ఊరిస్తున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి.
ఇదిలా వుంటే ఈ హక్కుల కోసం పివిపి బ్యానర్ కిందామీదా అవుతోంది. తనకు , ఆస్కార్ రవిచంద్రన్ కు వున్న ఆర్థిక లావాదేవీల సెటిల్ మెంట్ కింద ఈ హక్కులు పొందాలని పివిపి ప్రసాద్ చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సెటిల్ మెంట్ 20 దగ్గరలో కాబట్టి, మరో 15ను ఇస్తేనే అని నిర్మాత అడుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అసలు సినిమా జోనర్ ఇంతవరకు స్పష్టం కాలేదు. ఫాంటసీ అని తెలుస్తోంది,. మరీ ఓవర్ హడావుడి వున్నా మన బి సి సెంటర్ల జనం చూడడం కష్టం. పైగా పక్క రాష్ట్రాల్లో విడదలకు పెద్ద స్కొప్ వుండదు. తమిళ, కన్నడ,హిందీ వగైరా అన్ని భాషల్లో వస్తుంది కాబట్టి. కేవలం మన మూడు సర్కిళ్ల మీద ఆధారపడి కొనుగోలు చేయాలి. అదీ కేవలం శంకర్ ను నమ్ముకుని, విక్రమ్ ను నమ్ముకుని కాదు. ఎమీ జాక్సన్ నమ్ముకుని అంతకన్నా కాదు.