మారుతి సినిమాలన్నీ గమ్మత్తుగా ఉంటాయి. అతడే డైరక్ట్ చేసినా, కథ మరొకరికి ఇచ్చి డైరక్ట్ చేయమన్నా అవన్నీ డిఫరెంట్ కథలే. ఈసారి కూడా అలాంటి డిఫరెంట్ కథనే మరో దర్శకుడికి ఇచ్చాడు. ఓ కొత్త హీరోను సెట్ చేశాడు. ప్రమోషన్ కూడా తనదైన శైలిలో స్టార్ట్ చేశాడు. అంతా బాగానే ఉంది కానీ, ఆ కథ మాత్రం కొత్త కుర్రాడు చేసేది కాదు.
అదే బ్రాండ్ బాబు సినిమా.
కొన్ని కథలు కొందరికే సూట్ అవుతాయి. సమరసింహారెడ్డి లాంటి ఫుల్ యాక్షన్-ఫ్యాక్షన్ స్టోరీలో నాగచైతన్యను ఊహించుకోగలమా..? అలాగే ఏమాయచేశావె లాంటి ప్రేమకథలో బాలయ్యను ఊహించుకోగమా..? బ్రాండ్ బాబు స్టోరీ కూడా సరిగ్గా ఇలాంటిదే. ఇదొక స్టార్ హీరో చేయాల్సిన సినిమా. మరీ ముఖ్యంగా స్టయిల్ కు ఐకాన్స్ లా ఉన్న బన్నీ, మహేష్ లాంటి హీరోలు చేయాల్సిన సినిమా.
పోనీ.. వాళ్ల రేంజ్ కు మారుతి వల్ల కాకపోయినా ఎట్ లీస్ట్ సుధీర్ బాబుతో అయినా ట్రై చేయాల్సిన సినిమా ఇది. అంతేతప్ప, కొత్త కుర్రాడు చేయాల్సిన మూవీ కాదు. ఈ సినిమాను ఇప్పటికే కొంతమంది ప్రత్యేకంగా చూశారు. వాళ్లంతా కామన్ గా వ్యక్తంచేసిన అభిప్రాయమిది.
భలేభలే మగాడివోయ్ సినిమాలో నానిని మతిమరుపు వ్యక్తిగా చూపించాడు. మహానుభావుడులో అతిశుభ్రత కలిగిన హీరోను చూపించాడు. ఇప్పుడు బ్రాండ్ బాబులో ప్రతిది బ్రాండ్ కోరుకునే హీరోను చూపించాడు మారుతి. ఈ హీరో, ఓ స్టార్ అయితే సినిమా నెక్ట్స్ లెవెల్లో ఉండేదని అంతా అనుకుంటున్నారు. ఈ సినిమాకు కథ అందించిన మారుతి, దీనికి సమర్పకుడిగా కూడా వ్యవహరిస్తున్నాడు.