పెద్ద టెక్నీషియన్లతో కాస్త జాగ్రత్తగా వుండాలి. చిన్నమాట తేడా వచ్చినా, కాస్త ఇబ్బందిగానే వుంటుంది. అందులోనూ తమ పనిలోకి దూరి, ఇలా చేయాలి.. అలా చేయాలి అంటే వాళ్లకు ఎక్కడో కాలుతుంది. ఓ సినిమా సెట్ లో ఇలాంటి వ్యవహారమే జరిగినట్లు తెలుస్తోంది.
డైరెక్టర్ నక్కిన త్రినాధరావుకు రైటర్ బెజవాడ ప్రసన్న రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ లాంటి వ్యక్తి. సెట్ లో చాలావరకు విషయాలు డైరెక్టర్ తరపున ఆయనే చక్క బెడుతుంటారని వినికిడి. అది వాళ్లకు వాళ్లకు వున్న అండర్ స్టాండింగ్.
అయితే ఇప్పుడు ఈ ఇద్దరు దిల్ రాజు సినిమాకు పని చేస్తున్నారు. రామ్ హీరోగా తయారవుతున్న హలో గురూ ప్రేమ కోసమే సినిమా అది. ఈ సినిమాకు సీనియర్ సినిమాటోగ్రాఫర్ విజయ్ కే చక్రవర్తి వర్క్ చేస్తున్నారు.
ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో విజయ్ కు ఈ బెజవాడ ప్రసన్న ఏవో కలర్ స్కీమ్ లు వగైరాలపై సలహాలు సూచనలు ఇవ్వబోయారట. దాంతో విజయ్ కె చక్రవర్తికి ఎక్కడ మండాలో అక్కడ మండింది. చెబితే గిబితే డైరెక్టర్ చెప్పాలి కానీ, ఈ రైటర్ చెప్పడం ఏమిటి? అన్నది కాస్త వుంటుంది కదా? దాంతో ఆయన కాస్త గట్టిగానే రివర్స్ అయి, క్లాస్ పీకినట్లు యూనిట్ వర్గాల బోగట్టా.
ఆ తరువాత డైరెక్టర్ నక్కిన కలుగచేసుకుని, కూల్ చేసారు. ఇది జరిగి రెండు మూడు రోజులు అయినట్లు యూనిట్ వర్గాల బోగట్టా.