సినిమాను పైరసీ చేయడం అంటే ఇంటలెక్చ్యువల్ ప్రాపర్టీని దొంగిలించడం లేదా కాపీ చేయడం అంత ఘోరం అంటున్నారు రాజమౌళితో సహా బాహుబలి జనాలు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ పైరసీ చేయవద్దని, దాన్ని ప్రోత్సహించవద్దని కోరారు. సరే..బాగానే వుంది.
మరి ఇంటలెక్చ్యువల్ ప్రాపర్టీని కొట్టేయడం అంటే మన సినిమా జనాల తరువాతే ఏవరైనా? హాలీవుడ్ మూకీ సినిమాను తీసుకుని, కాపీ కొట్టేసి మర్యాదరామన్నగా అందించలేదా? తన సినిమాల్లో చాలా సీన్లు హాలీవుడ్ నుంచి కొట్టేసినవే అని గతంలో నెటిజన్లు ప్రూవ్ చేయలేదా. అంతెందుకు..బాహుబలి ఫస్ట్ లుక్ విషయంలో కూడా ఇలాంటి వ్యవహారం బయటపడలేదా?
పైరసీ అనేసరికి సినిమా జనాలు గగ్గోలు పెడతారు. కానీ మరి కొరియన్ సినిమాలు సిడీల్లో చూసి, తెలుగుసినిమాలుగా మార్చేయడం లేదా. దాదాపు ఎన్ని కొరియన్ సినిమాలు తెలుగు సినిమాలుగా మారాయి?
మరి మీరే ఇలా చేస్తూ, మీదాకా వచ్చేసిరికి పైరసీ, సుద్దులు, లాంటి కబుర్లు చెబుతారు. ఎవరు వింటారని? పైగా థియేటర్లు ఇప్పుడు బాహుబలి కోసం అనఫిషయల్ గా రేట్లు పెంచుతున్నాయి. చిన్న పట్టణాల్లోని థియేటర్లు అధికారులకు మామూళ్లు ఇచ్చి, యూనిఫారమ్ రేటు ఫిక్స్ చేసి డబ్బు చేసుకుంటున్నాయి. మరి అలా సినిమాను కామన్ మాన్ కు దూరం చేస్తున్నపుడు పైరసీ వైపు వెళ్లకుండా, సినిమా చూడకుండా కూర్చుంటారా ప్రేక్షకులు?