మీరు డైరక్షన్ చేయండి చాలు

ఈ మధ్య డైరక్టర్లలో డైరక్షన్ తప్ప, మిగిలినవన్నీ చేసేసేవారు కూడా కొందరు వుంటున్నారు. కాస్త డిమాండ్ వున్న డైరక్టర్లు అయితే ఫలానా పనికి వాళ్లను పెట్టాలి, వీళ్లను పెట్టాలి అని చెప్పి, తమ కోటరీకే…

ఈ మధ్య డైరక్టర్లలో డైరక్షన్ తప్ప, మిగిలినవన్నీ చేసేసేవారు కూడా కొందరు వుంటున్నారు. కాస్త డిమాండ్ వున్న డైరక్టర్లు అయితే ఫలానా పనికి వాళ్లను పెట్టాలి, వీళ్లను పెట్టాలి అని చెప్పి, తమ కోటరీకే పనులు అప్పగించడం కామన్ అయిపోయింది. కానీ ఇలాంటి డైరక్టర్ల వలన నిర్మాతను, సంస్థను నమ్ముకున్నవారో, హీరోను నమ్ముకున్నవారో ఇబ్బంది పడుతున్నారు.

భారీ సినిమాలు తీయడంలో, తెర ముందు ఎంతమంది జనాలు వుంటారో, తెరవెనుక కూడా అంతమందిని పెట్టి పనిచేయడం, సీన్ ను ఎలివేట్ ఎలా చేస్తారో, 'బాబూ.. బాబూ.. ఇలా బాబూ.. అలా బాబూ' అంటూ తన మాటలతో కోటలు దాటించగలిగే డైరక్టర్ ఒకరు. సీనియర్ నిర్మాతతో కలిసి, ఓ టాప్ హీరోతో సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

ఎప్పటిలాగే వాళ్లను పెట్టండి, వీళ్లను పెట్టండి అంటూ మొదలు పెట్టారట. అఖరికి వచ్చేసరికి, సినిమా పూర్తయిన తరువాత చేయబోయే వ్యవహారాల గురంచి కూడా ఇలా చేయాలి, అలా చేయాలి, ఆ మధ్య తను చేసిన సినిమాకు అలాగే చేసా, ఇలాగే చేసా అంటూ ఉపన్యాసం మొదలు పెట్టారట.

సదరు డైరక్టర్ హంగామా చేసిన ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా, నిర్మాత లాస్ అయిన సంగతి తెలిసిన ఈ సీనియర్ నిర్మాత, 'మీరు సినిమా తీయండి చాలు, దాన్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలో, థియేటర్లలో ఎలా వేయాలో నేను చూసుకుంటా' అన్నాడట. దాంతో అవాక్కయిన ఆ దర్శకుడు మరి కిక్కురుమనలేదట. దర్శకుడు అన్నపుడు సినిమా మీద పూర్తిగా దృష్టి పెట్టకుండా ఈ ఎగస్ట్రా కల్చరల్ ఏక్టివిటీస్ ఎందుకో?