ఏం జరిగింది? ఏం జరుగుతోంది ? ఏం జరుగుతుంది ? ఇలాంటి ప్రశ్నలు బ్రూస్ లీ సినిమా తరువాత మెగాక్యాంప్ లో తెగ వినిపించాయి. మీటింగ్ ల మీద మీటింగ్ లు తెగ పెట్టేసారు. కిందా మీదా అయిపోయారు. ఇప్పుడు మరీ అంతటి పరిస్థితి కనిపించడం లేదు కానీ, అలాంటి వ్యవహారం వుండేలా వుంది. నోట్ల రద్దు కారణమా? లేక రాను రాను చరణ్ ఓపెనింగ్స్ చరిష్మా తగ్గుతోందా? అన్న అనుమానాలు మెగా క్యాంప్ లో వినిపిస్తున్నాయి.
తొలి రోజు ధృవ సినిమాకు థియేటర్ల కొరత లేనే లేదు. దాదాపు యాభైకి పైగా సెంటర్లలో 90 శాతం థియేటర్లు ధృవకే ఇచ్చేసారు. మార్కెట్ లో సరైన సినిమా లేదు కనుక ఇది సాధ్యమైంది. అయినా కూడా ఓపెనింగ్స్ అంత గొప్పగా లేవని ఇండస్ట్రీ ట్రేడ్ సర్కిళ్ల బోగట్టా.
కొన్ని సెంటర్లలో మాత్రం మార్నింగ్ షోలకు మంచి బ్లాక్ రేట్ నడిచిందట. కొన్ని చోట్లు టికెట్ అయిదు వందలకు కూడా అమ్మారట. అయితే అలాంటి సెంటర్లు చాలా తక్కువ. ఉదయం ఎనిమిది గంటలకు కొన్ని చోట్ల షోలు పడ్డాయి. అలాంటి చోట్ల ఇలాంటి సీన్ కనిపించిందట.
ఓవర్ ఆల్ గా చూసుకుంటే ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కన్నా ఓపెనింగ్స్ తక్కువే వుంటాయని డిస్ట్రిబ్యూషన్ సర్కిళ్ల అంచనా. సీడెడ్ లో జనతా గ్యారేజ్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ కన్నా కొటి రూపాయలన్న వెనక వుంటుందని అంటున్నారు.
నెల్లూరు లాంటి సెంటర్లలో కూడా మార్నింగ్ షో ఫిగర్లకు మాట్నీ ఫిగర్లకు తేడా వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎక్కువ ధియేటర్లు వేయడం వల్ల బాగున్న థియేటర్లల్లొ ఫుల్స్ వుంటున్నాయి. మిగిలిన వాటిలో ఆ మేరకు తగ్గుతున్నాయి. అయితే గతంలో కూడా పెద్ద సినిమాలకు ఇలా మాగ్జిమమ్ థియేటర్లలో సినిమాలు వేసినా, ఇలాంటి పరిస్థితి లేదు. దీనంతటికీ కారణం నోట్ల రద్దు మాత్రమేనే ? ఇంకేమైనా వుందా? అన్న డిస్కషన్లు స్టార్ట్ అయిపోయాయి అభిమానుల్లో.
ఇదిలా వుంటే ఈ సినిమా బ్రేకీవెన్ అవుతుందా అన్న లెక్కలు కూడా ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమాకు టోటల్ గా చరణ్ రెమ్యూనిరేషన్ తో కలిపి 57 కోట్లు ఖర్చు చేసారు. తొమ్మిదిన్నర శాటిలైట్ వచ్చింది. ఇంక 48 కోట్లు ప్లస్ కనీసం పదిశాతం అయినా ఖర్చులు రావాలి. వారం గ్యాప్ అయితే వుంది. ఆపైన సింగం వస్తోంది. నిర్మాత అల్లు అరవింద్, ఎన్ వి ప్రసాద్ లు మాత్రం సినిమా ఫైనాన్స్ వ్యవహారాలతో అంత హ్యాపీగా లేరని ఇన్ సైడ్ వర్గాల టాక్.