సమంత న్యూ ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తుందా.?

''పెళ్ళయ్యాక అవకాశాలు తగ్గాయి.. ఎందుకో తెలియదు.. నాగార్జున కోడల్ని కానుండడంతో, అమ్మో, ఆమెతో కష్టమే..' అనే అభిప్రాయానికి చాలామంది వచ్చేశాయేమో..'' అంటూ సమంత తెగ ఇదయిపోతోంది. ఊహ ఒకప్పుడు హీరోయిన్‌.. ఆమె పెళ్ళయ్యాక సినిమాలు…

''పెళ్ళయ్యాక అవకాశాలు తగ్గాయి.. ఎందుకో తెలియదు.. నాగార్జున కోడల్ని కానుండడంతో, అమ్మో, ఆమెతో కష్టమే..' అనే అభిప్రాయానికి చాలామంది వచ్చేశాయేమో..'' అంటూ సమంత తెగ ఇదయిపోతోంది. ఊహ ఒకప్పుడు హీరోయిన్‌.. ఆమె పెళ్ళయ్యాక సినిమాలు మానేసింది. అమల కూడా అంతే. చాలామంది హీరోయిన్లు, పెళ్ళయ్యాక హీరోయిన్‌గా రిటైర్‌ అయిపోయారు. రేప్పొద్దున్న సమంత కూడా.. అని అంతా అనుకుంటున్న తరుణంలో, 'సమంత సినిమాలేమీ మానెయ్యదు..' అని సమంతకి కాబోయే భర్త నాగచైతన్య క్లారిటీ ఇచ్చేశాడు. 

నాగచైతన్య క్లారిటీ ఇచ్చేసినా, సమంతకి మాత్రం టాలీవుడ్‌లో అవకాశాలు రావడంలేదు. తమిళంలో మాత్రం సినిమాలు చేస్తోంది. పెళ్ళయిన హీరోయిన్లతో దర్శక నిర్మాతలకి కొన్ని సమస్యలుంటాయి. డేట్స్‌ అడ్జస్ట్‌ చేయడం పెద్ద సమస్య. దానికి తోడు, సినిమా మధ్యలో వుండగా ప్రెగ్నెన్సీ వస్తే, ఇక అంతే సంగతులు. సోనాలి బింద్రే విషయంలో ఇదే సమస్య వచ్చిందని అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. ఐశ్వర్యారాయ్‌ కూడా అలాగే కొన్ని సినిమాలకి ఇబ్బంది పెట్టిందనే వాదనలున్నాయి. అయితే అదంతా నాన్సెన్స్‌ అనేవారూ లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. 

ఇక, తాను హీరోయిన్‌గా కెరీర్‌ని ఫుల్‌స్టాప్‌ పెడితే ముందుగా ఫీలయ్యేది తనకు కాబోయే మామగారు నాగార్జునేనంటూ సమంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. నాగ్‌ ఫీలవుతాడో లేదోగానీ, అవకాశాల కోసం సమంత ఇంతలా పబ్లిసిటీ స్టంట్లు చేస్తోందనే విషయం స్పష్టమవుతోంది. ఇదిలా వుంటే, చరణ్‌ సరసన సుకుమార్‌ డైరెక్షన్‌లో సమంత హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయంటూ గాసిప్స్‌ విన్పిస్తోన్న విషయం విదితమే. అదే గనుక నిజమైతే, సమంత టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టినట్లే. చూద్దాం, పెళ్ళయ్యాక కూడా సమంత, ఇదివరకట్లా గ్లామరస్‌ హీరోయిన్‌గా కన్పిస్తుందో లేదో.!