చిరంజీవి కేక్ కటింగ్ చేస్తారు.. సినిమా ఫస్ట్ లుక్ అక్కడే విడుదలవుతుంది.. పవన్‌కళ్యాణ్ కూడా వస్తాడట.. ఇలా అభిమానుల్లో చాలా చాలా ఆశలు. తీరా ఈవెంట్‌కి వెళితే అక్కడేమీ లేదు. షరామామూలు సినిమా ఫంక్షన్లలో కన్పించే సందడే అక్కడా కనిపించింది. పాటలు పాడారు, డాన్సులేసేశారు.. ఇంకా ఏదేదో హడావిడి చేశారు. చివరికి తుస్సుమనిపించారు.
ఆఖరికి, దర్శకుడు సురేందర్‌రెడ్డికి మైక్ ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకున్నంత పన్జేశారు. 'ధృవ' సినిమా గురించీ, చిరంజీవి గురించీ మాట్లాడదామనుకున్న సురేందర్‌రెడ్డి, వెనకాల కేక్ కటింగ్ హడావిడి మొదలవడంతో సగంలోనే తన స్పీచ్‌ని ఆపేయాల్సి వచ్చింది. మాట్లాడమని సురేందర్‌రెడ్డిని వేదిక మీదకు పిలిపించి, అవమానించారన్న విషయం స్పష్టమవుతోందక్కడ. 'మీరు మాట్లాడండి..' అంటూ చరణ్, సురేందర్‌రెడ్డిని రిక్వెస్ట్ చేశాడుగానీ, ఓవరాల్‌గా ఈవెంట్‌ని సరిగ్గా మేనేజ్ చేయలేకపోయారు.
చిరంజీవి పుట్టినరోజు వేడుక.. అంటే ఎలా జరగాలి.? ఆ స్థాయిలో హంగామా ఏమీ కన్పించలేదు. చరణ్, అల్లు అర్జున్, ఇంకొందరు మెగా హీరోలు, వీరికి తోడు దర్శకులు వినాయక్, సురేందర్‌రెడ్డి, ఒకరిద్దరు ప్రముఖులు.. ఇంతకు మించి ఇక్కడ పెద్దగా సీన్ లేదు. పైగా, వేదిక మీద ఏమన్నా గొప్పగా అభిమానుల్ని ఉర్రూతలూగించిన ప్రసంగాలున్నాయా.? అంటే అదీ లేదు. సినిమా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యింది. అదేదో పుట్టినరోజు వేడుకల్లో లాంఛ్ చేసినా బాగుండేది.
అన్నిటికీ మించి, చిరంజీవి ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టడంతో అభిమానులు ఆగ్రహావేశాలతో రగలిపోతున్నారు. పిలిచి అవమానించడమంటే ఇదేనని అభిమానులు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోసేస్తున్నారు. మామూలుగా అయితే ముందు రోజు రాత్రికి ఈవెంట్ నిర్వహిస్తుంటారు.. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా. ఈసారి అందుకు భిన్నంగా జరిగింది. ఇంకోపక్క ప్రముఖుల కోసం చిరంజీవి, ఓ స్టార్ హోటల్లో పార్టీ ఏర్పాటు చేశారు. దానికి మాత్రం చిరంజీవి హాజరయ్యారు. అది అభిమానులకి 'పుండు మీద కారం చల్లినట్లు'గా తయారయ్యింది.
అభిమానులు పాల్గొనే ఈవెంట్‌కి వెళితే, అక్కడ మళ్ళీ పవన్‌కళ్యాణ్ పేరుతో ఏమన్నా హడావిడి జరుగుతుందా.? ఆ మాత్రందానికి అక్కడికి వెళ్ళడం అవసరమా.? ఇలాంటి సవాలక్ష అనుమానాలతోనే చిరంజీవి, మెగా ఈవెంట్‌కి డుమ్మా కొట్టారనే ప్రచారం జరుగుతోంది. కారణం ఏదైనాగానీ, మెగా ఈవెంట్ మాత్రం మెగా ఫ్లాప్ అయ్యిందని అభిమానులే అంటోన్న పరిస్థితి.