తెలుగులో మల్టీస్టారర్ సినిమాలకు గేట్లు తెరుచుకొన్నాయి. కథానాయకులు కలిసి నటించేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. అందుకే దర్శకులు, రచయితలు మల్టీస్టారర్ కథల్ని సిద్ధం చేసుకొనే పనిలో పడ్డారు. త్వరలోనే మెగా కథానాయకులు రామ్చరణ్, అల్లు అర్జున్ కథానాయకులుగా ఓ చిత్రం తెరకెక్కబోతోందని ఫిల్మ్నగర్లో ప్రచారం సాగుతోంది.
హిందీలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న `గూండే`ని తెలుగులో మెగా కథానాయకులపై తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇదివరకు `చింతకాయల రవి` ఫేమ్ యోగి దర్శకత్వంలో మెగా మల్టీస్టారర్ తెరకెక్కబోతోందని ప్రచారం సాగుతోంది. రామ్చరణ్ నటించిన `తుఫాన్` చిత్రానికి యోగి సహకారం అందించారు. ఆ అనుబంధంతోనే యోగి మెగా కథానాయకులతో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం `గూండే` రీమేక్ హక్కుల కొనుగోలు గురించి సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ పతాకంపైనే ఈ చిత్రం తెరకెక్కే అవకాశాలున్నట్టు తెలిసింది. ఇటీవల చరణ్-అల్లు అర్జున్ కలిసి నటించిన `ఎవడు` విజయవంతమైంది. దీంతో తదుపరి ప్రాజెక్టుపై మరిన్ని అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది.